ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతుంది. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు పలువురు మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు తదితరులు పాల్గొన్నారు.
అయితే, ఈ సందర్భంగా ఏపీలోని అభివృద్ధి, శాంతిభద్రతలు, పాలన, ప్రజాసేవల అమలు లాంటి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష జరపనున్నారు. ముఖ్యంగా జీఎస్డీపీ వృద్ధి రేటు, వ్యవసాయం, విద్య, వైద్యం, పర్యాటకం, పీ-4, సూపర్ సిక్స్, పరిశ్రమ రంగాల పురోగతిపై చర్చించనున్నారు. ఇక, రాష్ట్రాభివృద్ధి దిశగా అన్ని జిల్లాల కలెక్టర్ల పని తీరును సమీక్షించడంతో పాటు శాఖల వారీగా ప్రజెంటేషన్లు కూడా ఇవ్వనున్నారు. కాగా, రెండు రోజుల పాటు మొత్తం 8 అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపి పలు మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.