CM Jagan: చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చేది.. వెన్నుపోటు మాత్రమే

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అవమానించి టీడీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు సభకు ఎందుకు రావడం లేదో ఆయనకే తెలియడం లేదని సెటైర్ వేశారు. అసలు టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిన మేలు ఏంటని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు గత పాలనను ప్రజలు ఛీకొట్టారన్న జగన్.. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ప్రజా సంక్షేమ పథకం ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు పథకం గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు.

టీడీపీ పాలనలో ఎన్నికల వాగ్దానాలకు విలువేంటో.. తమ ప్రభుత్వంలో చేసిన వాగ్దానాలకు విలువేంటో స్పష్టంగా తెలుస్తోందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారని జగన్ గుర్తుచేశారు. తాము మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో ఇప్పటివరకు 96శాతం వాగ్దానాలను నెరవేర్చామని జగన్ చెప్పారు. పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. కుల, మత, పార్టీలు, వర్గాలు అని చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎవరి హయంలో పాలన బాగుందో ప్రజలంతా ఆలోచించాలన్న ఆయన.. గ్రామాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, వైఎస్ఆర్ క్లినిక్‌లు ఇలా ఎన్నో మార్పులు చేశామని జగన్ తెలిపారు.

https://ntvtelugu.com/ycp-mlas-srikanth-reddy-and-ambati-rambabu-satirical-comments-on-chandrababu-and-tdp-mlas/