Andhra Pradesh: కొత్త ఏడాదిలో ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు. దీంతో పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించారు. తొలుత నెల్లూరు జిల్లా రాజకీయాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. ఈ మేరకు సోమవారం నాడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పిలిపించి క్లాస్ తీసుకున్నారు. ఆయన ఇటీవల పార్టీ కార్యక్రమాలపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం సీఎం జగన్ వద్దకు వెళ్లింది. దీంతో కోటంరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై పలు సూచనలు చేశారు. అయితే తాను పార్టీపై పబ్లిక్ మీటింగ్‌లలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కోటంరెడ్డి వివరణ ఇచ్చారు.
Read Also: Singareni: డిసెంబర్‌లో సింగరేణి ఆల్ టైం రికార్డ్
అటు మంగళవారం ఆనం విషయంలో సీఎం జగన్ చర్యలు చేపట్టారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆనం రాంనారాయణరెడ్డి విమర్శలు చేస్తుండటంతో వెంకటగిరిలో ఆనంకు చెక్ పెట్టారు. వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జిగా ఆనం స్థానంలో నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డిని సీఎం జగన్ నియమించారు. మరోవైపు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంపైనా సీఎం జగన్ దృష్టి పెట్టారు. ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం మధ్య విభేదాలు నడుస్తుండటంతో ఇరువురి మధ్య సర్దుబాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పర్చూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఆమంచి కృష్ణమోహన్‌ను నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. పర్చూరు వెళ్లేందుకు ఇటీవల నిరాసక్తి వ్యక్తం చేసిన ఆమంచి ప్రస్తుతం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో చీరాలలో నేతల మధ్య విభేదాలకు సీఎం జగన్ చెక్ పెట్టనున్నారు.