NTV Telugu Site icon

CM Jagan: రైతుల ధాన్యం సేకరణను అధికారులందరూ సవాల్‌గా తీసుకోవాలి

Cm Jagan Mohan Reddy

Cm Jagan Mohan Reddy

CM Jagan: అమరావతిలోని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సోమవారం నాడు వ్యవసాయ శాఖపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నామని.. రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా అధికారులు ధాన్యం సేకరణ కొనసాగించాలని సీఎం జగన్ సూచించారు. అటు ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు రైతులు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా రాకూడదని.. దీన్ని అధికారులు సవాల్‌గా తీసుకోవాలని పేర్కొన్నారు. ఇ-క్రాపింగ్‌ డేటాను వాడుకుని అత్యంత పటిష్ట విధానంలో సేకరణ కొనసాగాలని సూచించారు. వ్యవసాయశాఖతో పౌరసరఫాల శాఖ అనుసంధానమై రైతులకు మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

Read Also: Minister Roja: జగన్ తగ్గేది లేదు.. చంద్రబాబు, పవన్ నెగ్గేది లేదు..!!

రబీ సీజన్‌కు అధికారులు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ అన్నారు. ఎరువులు, విత్తనాలు వంటి రైతులకు కావాల్సివన్నీ సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి ఆర్బీకేలో ఒక డ్రోన్‌ను ఉంచేలా కార్యాచరణ సిద్ధం చేయాలని.. వచ్చే రెండేళ్లలో అన్ని ఆర్బీకేల్లోనూ డ్రోన్స్ ఉండేలా చూడాలని సూచించారు. అనంతరం ప్లాంట్‌ డాక్టర్స్ కాన్సెప్టుపై‌ సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. భూసార పరీక్షలు చేసే పరికరాలను ప్రతి ఆర్బీకేలో ఉంచాలని.. ఈ పరికరాలను అన్ని ఆర్బీకేలకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. మార్చిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. భూసార పరీక్షలు కారణంగా ఏ ఎరువులు వాడాలి? ఎంతమేర వాడాలన్న దానిపై స్పష్టత వస్తుందన్నారు. దీని వల్ల పెట్టుబడి తగ్గి దిగుబడులు పెరుగుతాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా భూసారాన్ని పరిరక్షించుకునేందుకు అవకాశం ఏర్పాడుతుందన్నారు.