AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఇవాళ ( జనవరి8న) జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించబోతున్నారు. సీఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన పలు అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, కృష్ణా నది తీరంలో మెరినా వాటర్‌ఫ్రంట్ అభివృద్ధి కోసం భూ కేటాయింపుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అలాగే, రాజధానిలో గతంలో కేటాయించిన 112 ఫ్లాట్లలో మార్పులకు సైతం కేబినెట్ ఆమోదం తెలపనుంది.
Read Also: US: అమెరికాలో దారుణం.. మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్
అయితే, ఎస్‌ఐపీబీలో (SIPB) ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలకు కూడా ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మొత్తం 14 సంస్థలకు చెందిన రూ. 19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా మంత్రిమండలి ఆమోదం ఇవ్వనుంది. కేబినెట్ సమావేశం అనంతరం, తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు, వైసీపీ కౌంటర్లపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
