Site icon NTV Telugu

AP Cabinet: గుడ్ న్యూస్ చెప్పిన కేబినెట్.. వృద్ధాప్య పెన్షన్ పెంపు

Ap Cabinet Cm Jagan

Ap Cabinet Cm Jagan

CM Jagan: అమరావతిలోని సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించి మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది. రూ.2,500 పెన్షన్‌ను వచ్చే నెల నుంచి రూ.2,750కి పెంచుతున్నట్లు కేబినెట్ ప్రకటించింది. ఫలితంగా 62.31 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. జనవరి 1 నుంచి పెంచిన పెన్షన్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు వైఎస్ఆర్ పశుబీమా పథకం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్ క్లాస్‌లు, ఫౌండేషన్ స్కూళ్లలో స్మార్ట్ టీవీ రూంలను నాడు-నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

అయితే కేబినెట్‌ అజెండా పూర్తయిన తర్వాత కాసేపు మంత్రులతో సీఎం జగన్ రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని మంత్రులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం కోసం సీరియస్‌గా పనిచేస్తే మీకే మంచిదని ఆయన హితవు పలికారు. మంత్రులు ఎక్కువ బాధ్యతగా ఉండాలన్నారు.

Read Also: Janasena Party: ‘యువశక్తి’ పేరుతో జనవరి 12న పవన్ భారీ బహిరంగ సభ

అటు రాష్ట్రంలో దుష్టచతుష్టయం తీరుపై కేబినెట్‌లో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తున్నా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు పూర్తి పారదర్శకంగా ఉండాలని.. లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలను పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ 21న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను ప్రతి స్కూల్‌కు వెళ్లి అందించాలని ఆదేశించారు. పెంచిన పెన్షన్, వైఎస్ఆర్ ఆసరాను నేరుగా లబ్ధిదారులకు అందించాలని తెలిపారు. మంత్రులు ఇంఛార్జులుగా ఉన్న జిల్లాల్లోనూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. పార్టీలో నేతల మధ్య విభేదాలుంటే ఇంఛార్జ్ మంత్రులు పరిష్కరించాలని సీఎం జగన్ అన్నారు.

Exit mobile version