ఏపీలో ఏం జరుగుతోంది? నేతలమధ్య అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయా? అంటే అవుననే అంటున్నారు. ఏపీ బీజేపీలో ముసలం పుట్టిందనే వార్తలు పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా విజయవాడలో ఒక హోటల్ లో సమావేశం నిర్వహించారు నేతలు. జాతీయ కార్మిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో పార్టీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ కు ఆత్మీయసమావేశం పేరుతో సభ ఏర్పాటైంది.
ఈ సమావేశానికి బీజేపీ నేతలు కన్నా లక్ష్మీ నారాయణ, లంకా దినకర్, తురగా నాగభూషణం, జమ్ముల శ్యామ్ కిషోర్, కిలారు దిలీప్, పాతూరి నాగభూషణం మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, రమేష్ నాయుడు, ఎస్ కె బాజీ, శ్రీనివాసరాజు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేరు ప్రస్తవన లేకుండా జరిగిన సమావేశం ఉత్కంఠ రేపుతోంది.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయానికి తన వంతు కృషిచేసిన సత్యకుమార్ ను ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టాలని నేతలు కోరినట్టు సమాచారం. త్వరలో అధ్యక్ష పదవి మార్పు ఉంటుందని భావిస్తున్న సోము వీర్రాజు వ్యతిరేక వర్గం తమవంతు ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న నేతలు సత్యకుమార్ ను పొగడ్తలతో ముంచెత్తారు. సోము వీర్రాజు లేకుండా సమావేశం నిర్వహించటంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.