Somu Veerraju: ఏపీ రాజధాని అమరావతిలో బీజేపీ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘మనం – మన అమరావతి’ పేరుతో బీజేపీ పాదయాత్రను చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న భూముల్లో ఏమేం చేస్తారనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా బాగుందని విజయసాయిరెడ్డి చెప్తున్నారని.. నిజంగానే ఏపీ పరిస్థితి బాగుంటే అప్పుల కోసం రోజూ ఎందుకు పరిగెడుతున్నారని సోము వీర్రాజు సూటిగా ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు రాజధానిని ఎందుకు కట్టడం లేదని అడిగారు.
రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ మోసం చేయలేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీలను కూడా కేంద్రమే నిర్మిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ చెపుతున్న ప్రింటింగ్ మిషన్ కేంద్రం వద్ద ఉండదని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ఆర్ అండ్ ఆర్ నివేదికను కేంద్రానికి రాష్ట్రం ఇవ్వడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ఏటీఎం కాకూడదని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. ఏపీకి రాజధాని లేకుండా చేసింది వైసీపీనే అని ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ మేల్కొని రాజధాని అమరావతిలో వెంటనే నిర్మాణాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సోము వీర్రాజు పేర్కొన్నారు. తాము రాజధాని నిర్మాణం కోసం రూ.8,500 కోట్లు ఇచ్చామని.. చంద్రబాబు సగం రాజధాని కట్టి ఉంటే ఇలా అయ్యేది కాదని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. తాము ఏం తప్పు చేశామని చంద్రబాబు తమను వదిలేశాడని సోము వీర్రాజు ప్రశ్నించారు.
Read Also: CM Jagan Mohan Reddy: చంద్రబాబు హయాంలో డీపీటీ ఉండేది.. కానీ మా హయాంలో డీబీటీ ఉంది
అటు అమరావతిలో పాదయాత్ర చేస్తున్న సోము వీర్రాజును పలువురు రైతులు ప్రశ్నించారు. ఒకే రాజధాని అమలయ్యేలా మీరు ఏం చేస్తారని కొందరు రైతులు సూటిగా అడిగారు. ఒకే రాజధాని అని చెప్పడమేనా.. బీజేపీ ఏమైనా చేస్తుందా అని నిలదీశారు. అమరావతికి మోడీ శంకుస్థాపన చేసి వెళ్లాడు.. ఆరోజు నుంచి ఈ రోజు వరకు కలలు కంటూనే ఉన్నామని.. ఇంతలో జగన్ వచ్చి మూడు రాజధానులు అన్నాడని.. జగన్, బీజేపీ ఒక్కటేనని రైతులు మండిపడ్డారు.