Site icon NTV Telugu

AP Assembly: బడ్జెట్ కు ఆమోదం.. అసెంబ్లీ నిరవధిక వాయిదా

విపక్ష సభ్యుల సస్పెన్షన్లు, హాట్ హాట్ డిస్కషన్లు.. వాయిదాల మీద వాయిదాలతో చివరాఖరికి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ నెల 7న సభా సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23కి రాష్ట్ర అసెంబ్లీ ఇవాళ ఆమోదం తెలిపింది. అనంతరం, అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

జనరంజక బడ్జెట్ తీసుకువచ్చారంటూ స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. సభ్యులు వివిధ ప్రజాసమస్యలు ప్రస్తావించారని, ప్రభుత్వం బాధ్యతగా వాటన్నింటికీ సమాధానం చెప్పిందని వివరించారు. ప్రజల కోసం తీసుకువచ్చిన అద్భుతమైన చట్టాలకు సమావేశాల్లో ఆమోదం లభించిందని, చట్టాలను ఆమోదించడంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అటు, ఏపీ శాసనమండలి కూడా నిరవధికంగా వాయిదా పడింది. ఇదిలా వుంటే విపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, సస్పెన్షన్లతోనే సభ నడిచిందని ప్రతిపక్షం మండిపడింది.

ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా 2022–23 బడ్జెట్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ శాసనసభలో మాట్లాడారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన క్యాలెండర్‌ను శాసనసభ సాక్షిగా సీఎం వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. సంక్షేమ పథకాల అమలు ఎలా జరుగుతుందో.. రాష్ట్రంలోని ప్రతి రైతన్నను అడిగినా, స్కూల్‌ పిల్లవాడిని, పాపను, అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను ఎవరిని అడిగినా చెబుతారని, సంతోషం వారి కళ్లల్లోనే కనిపిస్తుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల క్యాలెండర్‌ పేదలకు వెల్ఫేర్‌ క్యాలెండర్‌ అయితే.. చంద్రబాబు ఫేర్వెల్‌ క్యాలెండర్‌ అవుతుందన్నారు. విపక్షం వ్యవహరించిన తీరుపై జగన్ మండిపడ్డారు.

https://ntvtelugu.com/ysrcp-leaders-waiting-for-jagan-cabinet-berth/
Exit mobile version