ఏపీలో జిల్లాల స్వరూపం మారిపోతోంది. మరికొద్ది గంటల్లో కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్. కొత్త జిల్లాలకు సంబంధించిన వివరాలను ఎన్టీవీతో ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ పంచుకున్నారు. మంటేడ మండలాన్ని పార్వతీపురం నుంచి విజయనగరం జిల్లాలోకి మార్చాం. పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి మండలాన్ని విశాఖలో ఉంచాం అన్నారు.
మిగిలిన నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో కొనసాగుతుంది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో మండలాల మార్పు చేశాం. మొత్తం మీద 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు జిల్లాల్లో ప్రాతినిధ్యం లభించినట్లు అయ్యింది. సాలూరు, పెందుర్తి, జగ్గంపేట, అనపర్తి, ముమ్మిడివరం, రామచంద్రాపురం, గోపాలపురం, వెంకటగిరి, నగరి, రాజంపేట, పాణ్యం, రాప్తాడు, పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమలను ఏలూరులో ఉంచాలన్న డిమాండ్ కు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
శ్రీకాకుళం జిల్లాలో ఒక ఐటీడీఏ కొత్తగా ఏర్పడింది. 42 ఏళ్ళ తర్వాత జిల్లాల విభజన జరిగింది. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో జిల్లాల విభజన జరుగలేదన్నారు విజయకుమార్. ఒక రెవెన్యూ డివిజన్‌కు సగటున 9 మండలాలు ఉండేటట్లు చూశాం. కుప్పం రెవెన్యూ డివిజన్‌ను ప్రత్యేకంగా పరిగణించి నాలుగు మండలాల్లో ఏర్పాటుచేశాం అన్నారు.
కుప్పం,విజయవాడ, విశాఖపట్నం స్పెషల్ కేసుగా చూశాం. విశాఖలో ఆరు నియోజకవర్గాలు ఉన్నా మొత్తం మీద 11 మండలాలే ఉన్నాయి. అర్బన్ ప్రాంతాల్లో ఈ స్టేల్ అప్లై చేయలేం. ఒక్కో జిల్లాలో సగటు జనాభా 18 లక్షల నుంచి 22 లక్షలు వుంటారు. నెల్లూరు 24 లక్షలు, బాపట్ల 15 లక్షలు జనాభా వుంది. సోమవారం ఉదయం 9.05 నిమిషాల నుంచి 9.45 నిమిషాల మధ్య ముఖ్యమంత్రి జగన్ కొత్త జిల్లాలు ప్రారంభిస్తారని విజయకుమార్ తెలిపారు.