Site icon NTV Telugu

Amarnath: అమర్‌నాథ్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. చర్యలకు సీఎం ఆదేశాలు

Amarnath

Amarnath

అమర్‌నాథ్‌ ఒక్కసారిగా వదరలు విరుచుకుపడ్డాయి.. దీంతో 15 మందికి పైగా భక్తులు మృతిచెందగా.. మరో 40 మందికి పైగా భక్తులు గల్లంతైనట్టు తెలుస్తోంది.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు.. ఇక, ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. సంబంధిత అధికారులకు ఫోన్‌ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక, అమర్‌నాథ్‌లో వరదలో బీభత్సం సృష్టించిన సమయంలో 12 వేల మంది వరకు భక్తులు ఉన్నట్టు చెబుతున్నారు.. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది.

Read Also: Nupur Sharma controversy: నుపుర్‌ శర్మ ఎఫెక్ట్.. భారత్‌పై సైబర్‌ వార్.. 2 వేల సైట్లు హ్యాక్‌..!

ఏపీలోని పలు జిల్లాల నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు భక్తులు వెళ్లినట్టుగా తెలుస్తోంది.. అమర్నాథ్ యాత్రలో విశాఖ వాసులు చిక్కుకున్నారని సమాచారం.. విశాఖ నుంచి సుమారు 90 మంది వెళ్లినట్టు తెలుస్తోంది.. ఈనెల 1న విశాఖ నుంచి బయల్దేరి వెళ్లారట కొంతమంది యాత్రికులు.. దీంతో, అధికారులను అప్రమత్తం చేశారు సీఎం వైఎస్‌ జగన్.. అమర్‌నాథ్‌ యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.. అమర్‌నాథ్‌ యాత్రలో కుండపోత వాన, ఆకస్మాత్తుగా వరదలు వచ్చాయన్న సమాచారం నేపథ్యంలో రాష్ట్రం నుంచి వెళ్లిన యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం.. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చేసుకోవాలని సూచించారు. ఇక, సీఎం ఆదేశాల నేపథ్యంలో సీఎంవో అధికారులు ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌తో మాట్లాడారు. అడిషనల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ఉన్న హిమాంశు కౌసిక్‌ను వెంటనే శ్రీనగర్‌కు పంపిస్తున్నారు. యాత్రికుల భద్రత, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన సమన్వయం చేస్తూ.. అవసరమైన చర్యలు తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. ఇక, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అమర్‌నాథ్ వెళ్లినట్టుగా తెలుస్తోంది.

Exit mobile version