NTV Telugu Site icon

Flex Banners: ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం వాయిదా.. కారణం ఇదే..

Cm Ys Jagan

Cm Ys Jagan

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.. నవంబర్‌ 1వ తేదీ నుంచి నిషేధం అమలులోకి వస్తుందంటూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది సర్కార్.. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయితే, ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం అమలును ప్రస్తుతానికి వాయిదా వేసింది వైఎస్‌ జగన్‌ ప్ఱభుత్వం… ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై రేపటి నుంచే నిషేధం అమల్లోకి రావాల్సిఉండగా.. జనవరికి 26వ తేదీకి వాయిదా వేసింది.. అయితే, ఇప్పుడు అంతా ఫ్లెక్సీల మయమే.. చిన్నా టీ కొట్టు బోర్డు నుంచి పెద్ద షాపింగ్‌ మాల్స్‌ , హోర్డింగ్స్‌ అన్నీ.. ఫ్లెక్సీ ఫ్రింటింగ్‌పైనే ఆధారపడి ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. సాంకేతిక పరిజ్ఞానం, తయారీ సామగ్రిని మార్చుకునేందుకు, సమకూర్చుకునేందుకు తగిన సమయం ఇవ్వాలంటూ ఫ్లెక్సీ తయారీదారులు ప్రభుత్వానికి విన్నవించారు.. వారి విజ్ఞప్తిని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సానుకూలంగా స్పందించారు.

Read also: TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. అర్ధరాత్రి నుంచే టోకెన్లు జారీ

దీంతో.. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల నిషేధాన్ని జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, ఈలోగా వారికి చేదోడుగా నిలవాలని అధికారులకు సూచించిన ఆయన.. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో వారికి తగిన విధంగా తోడుగా నిలవాలని.. అలాగే సామగ్రిని మార్చుకునేందుకు అవసరం మేరకు రూ.20 లక్షల వరకు పావలా వడ్డీకే ఫ్లెక్సీ తయారీదారులకు రుణాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.. మొత్తంగా.. నవంబర్‌ 1వ తేదీ నుంచి అమలు కావాల్సి ఉన్న ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల రద్దు అమలు జనవరి 26వ తేదీకి వాయిదా పడింది.. కాగా, పర్యావరణ హితంకోసం ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలను రద్దుచేస్తూ ఇదివరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. కాలుష్యాన్ని నివారించే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వం.. ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘించినట్లయితే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా విధించాలని.. ఉల్లంఘనులను పర్యావరణ పరిరక్షణ చట్టం కింద శిక్షించాలని నిర్ణయం తీసుకున్నారు.. ఫ్లెక్సీలపై నిషేధం నోటిఫికేషన్‌ అమలు, పర్యవేక్షణను రెవెన్యూ, పోలీసు, రవాణ, జీఎస్టీ తదితర విభాగాల అధికారులు చేపట్టాలని సూచించిన విషయం విదితమే కాగా.. తాజా ఆదేశాలతో అది జనవరి 26వ తేదీకి వాయిదా పడింది.

Show comments