AP ECET Results: ఏపీ ఈసెట్ ఫలితాలను బుధవారం మధ్యాహ్నం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి విడుదల చేశారు. ఈసెట్ ఫలితాల్లో 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన వెల్లడించారు. అబ్బాయిల ఉత్తీర్ణత శాతం 91.44గా, అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 95.68గా నమోదైనట్లు తెలిపారు. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం పూర్తి చేసిన వారికి బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి జేఎన్టీయూ ఆధ్వర్యంలో జులై 22న ఏపీ ఈసెట్ పరీక్ష నిర్వహించారు. ఈసెట్ పరీక్షకు మొత్తం 36,440 మంది విద్యార్థులు హాజరయ్యారు.
Read Also: Raksha Bandhan 2022: ఇంతకీ రాఖీ పండగ ఎప్పుడు? 11వ తేదీనా లేదా 12వ తేదీనా?
మొత్తం 14 విభాగాల్లో జరగాల్సిన పరీక్షకు 11 విభాగాల్లో మాత్రమే నిర్వహించామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి వెల్లడించారు. కొన్ని కోర్సుల్లో ఉన్న సీట్లకంటే దరఖాస్తులు తక్కువగా రావడంతో పరీక్ష నిర్వహించలేదన్నారు. సిరామిక్ ఇంజనీరింగ్, బీఎస్సీ గణితం విభాగాల్లో తక్కువ దరఖాస్తులు రాగా బయోటెక్‌కు ఎవ్వరు దరఖాస్తు చేయలేదన్నారు. బీఎస్సీ గణితం, సిరామిక్ టెక్నాలజీకి చేసుకున్న వారంతా ఈసెట్‌లో ఉత్తీర్ణత సాధించినట్లేనని జేఎన్టీయూ ఉప కులపతి వరప్రసాద్ రాజు తెలిపారు. బీఎస్సీ గణితం డిగ్రీ ఫలితాలు వెలువడిన తర్వాతే ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఇంజినీరింగ్ కాలేజీలు మేనేజిమెంట్ కోటా సీట్లను ఇష్టానుసారం అమ్ముకునే అవకాశం లేదన్నారు. సీట్ల భర్తీ ఎలా అనే దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. విద్యార్థులు తొందరపడి కాలేజీలకు డబ్బులు కట్టవద్దని సూచించారు.