NTV Telugu Site icon

PCC in Financial Crisis: ఆర్థిక సంక్షోభంలో పీసీసీ.. పార్టీ ఆఫీస్‌ల ఆస్తి పన్ను కూడా కట్టలేని పరిస్థితి..!

Gidugu Rudraraju

Gidugu Rudraraju

PCC in Financial Crisis: ఆర్థిక సంక్షోభంలో పీసీసీ కూరుకుపోయింది.. అది ఎంతలా అంటే.. పార్టీ కార్యాలయాలకు ఆస్తి పన్ను కూడా చెల్లించలేని స్థితి వచ్చింది.. దీనికి ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఏఐసీసీకి రాసిన లేఖ సాక్షింగా నిలుస్తోంది.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ఆస్తి పన్ను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటీసులు వచ్చాయి.. రాష్ట్రంలోని తొమ్మిది కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు గానూ రూ. 1.40 కోట్లకు పైగా బకాయిలు చెల్లాంచాలని పేర్కొంది.. దీంతో.. పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను చెల్లింపు వివరాలను ఏఐసీసీ ట్రెజరర్‌ దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లారు పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు.. దీనిపై స్పందించిన ఏఐసీసీ.. స్థానికంగానే నిధులు సమీకరించుకుని బకాయిలు చెల్లించుకోవాలని సమాధానం ఇచ్చింది.. దీంతో.. పార్టీలోని సీనియర్లను.. పార్టీ సానుభూతిపరులను విరాళాలు కోరుతూ లేఖ రాశారు గిడుగు రుద్రరాజు.. విరాళాలు అందించే వారు ఏ ఖాతాల్లో వేయాలో అనే బ్యాంకు వివరాలను కూడా ఆ లేఖలో పేర్కొన్నారు.. మొత్తంగా విరాళాలు సేకరించి.. ఆస్తి పన్ను చెల్లించేందుకు పీసీసీ సిద్ధం అయ్యింది.

Read Also: Minister RK Roja: ప్రజలు జగనన్న వన్స్ మోర్‌ అంటున్నారు.. టీడీపీది పగటి కలే..!

ఏఐసీసీకి రాసిన లేఖలో వివిధ జిల్లాల కార్యాలయాలకు పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను వివరాలను పేర్కొన్నారు గిడుగు రుద్రరాజు.. విశాఖపట్నం రూ.30 లక్షలు, కాకినాడ రూ.42,71,277, ఏలూరు రూ.6,29,926, విజయవాడ రూ.41,73,917, గుంటూరు రూ.3,92,282, ఒంగోలు రూ.5,31,783, నెల్లూరు రూ.1,51,867, కడప రూ.6 లక్షలు, కర్నూలు రూ.2,94,890.. ఇలా మొత్తంగా రూ.1.40 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్న వివరాలను లేఖలో పొందుపర్చారు.. ఇక, దానిపై అధిష్టానం స్పందించిన తర్వాత.. ఇప్పుడు ఫండ్‌ వసూలుకు పూనుకున్నారు పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు.. అసలే, ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న పార్టీని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి.. కానీ, ఆ పార్టీని మాత్రం ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి.