ఈరోజు ఏపీ సీఎం జగన్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు సీఎం టూర్ బిజీబిజీగా ఉండటంతో అధికారులు సీఎం ప్రయాణం కోసం జిల్లాలో రెండో చోట్ల హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటనపై లంక గ్రామాల వరద బాధితులు గంపెడాశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. జి.పెదపూడి వద్ద వంతెన నిర్మాణం పూర్తిపై సీఎం జగన్ స్పష్టత ఇస్తారని ఆశిస్తున్నారు. కోనసీమలో గోదావరి వరద ముంపుకు శాశ్వత పరిష్కారం లభించేలా సీఎం ప్రకటన చేస్తారని ఆకాంక్షిస్తున్నారు.
కోనసీమ జిల్లాలో వదర ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. రాజోలు చేరుకున్నారు.. వరద బాధితులను పరామర్శించి ప్రభుత్వ ఆర్థిక సహాయంపై ఆరా తీస్తున్నారు..
ప్రతి ఇంటికీ నష్టపరిహారం, నిత్యవసరాలు అందించామని తెలిపారు సీఎం వైఎస్ జగన్.. గంటిపెదపూడిలో వరద బాధితులను పరామర్శించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏఒక్కరూ మాకు అందలేదు అనడం లేదు.. పశువులకు నోరు ఉంటే అవి కూడా మెచ్చుకునేలా సహాయం చేశామన్నారు.. ముఖ్యమంత్రి అంటే ఆదేశాలు ఇవ్వాలి, వరదల్లో నేను వచ్చుంటే అధికారులు నాచుట్టూ తిరిగేవారు , ఫోటోల్లో టీవీల్లో బాగా కనిపించేవాడిని.. కానీ, నేను అలా కాదు.. వారంరోజులు టైమ్ ఇచ్చి వచ్చానని తెలిపారు. ఇక, జి.పి.లంక వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చిన సీఎం.. ఈఏడాదిలోనే పంటలకు నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు.
- ఏపీ సీఎం జగన్ రేపు (బుధవారం) అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాల్లో పర్యటించనున్నారు
- రెండో రోజు కూడా గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడనున్న సీఎం వైఎస్ జగన్
- ఉదయం 8.30 గంటలకు రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరనున్న సీఎం
- ఏఎస్‌ఆర్ జిల్లా చింతూరు చేరుకోనున్న సీఎం జగన్
- ఉదయం 9.30 గంటలకు చింతూరు మండలం కుయుగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి
- అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నయగుట్ట గ్రామం చేరుకోనున్న సీఎం జగన్
- అక్కడ ఏర్పాటు చేసిన వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని పరిశీలించనున్న జగన్
- అనంతరం తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు చెందిన వరద బాధితులతో సమావేశం
- మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్న సీఎం జగన్
వరద నష్టంపై అంచనాలు కొనసాగుతున్నాయని సీఎం జగన్ అన్నారు. అవి అందగానే అందరినీ ఆదుకుంటామన్నారు. అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ సీజన్‌లో నష్టం జరిగితే, అదే సీజన్‌లో సహయం అందజేస్తున్నామని తెలిపారు. గ్రామంలో వంతెన కావాలని గ్రామస్తులు కోరగా సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. తమకు మరో విలేజ్ క్లినిక్ కావాలని గ్రామస్తులు కోరగా సీఎం జగన్ ఆమోదం తెలిపారు.
తనది ప్రచార ఆర్భాటం కాదని.. తాను కూడా వరదల సమయంలో ఇక్కడికి వచ్చి, ఫోటోలకు ఫోజులిచ్చి డ్రామాలు చేస్తే టీవీల్లో కనిపించే వాడిని అని జగన్ అన్నారు. కానీ దాని వల్ల ఏం ప్రయోజనం ఉండదన్నారు. ముఖ్యమంత్రి అనే వాడు వ్యవస్థలను నడిపించాలన్నారు. ప్రజలకు మంచి జరిగేలా చూడాలన్నారు. సరైన సమయంలో సరైన సహాయం అందేలా చూడాలన్నారు. ఆ తర్వాత అది అందిందా.. లేదా.. అన్నది కూడా పరిశీలించాలన్నారు. అదే విధంగా అధికారులు తమ విధులు సమర్థంగా నిర్వర్తించేలా నిర్దేశించాలన్నారు. వారికి తగిన వనరులు కూడా సమకూర్చాలని తెలిపారు. అందుకే సహాయ పనులు, కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా అధికారులకు వారం రోజుల సమయం ఇచ్చానని.. ఇప్పుడు తాను వచ్చానని.. బాధితులకు సహాయ కార్యక్రమాలు ఎలా అందాయన్నది స్వయంగా తెలుసుకోవడానికి వచ్చానని జగన్ పేర్కొన్నారు.
గోదావరి వరదల సమయంలో బాధితులందరికీ అండగా నిలిచామని సీఎం జగన్ చెప్పారు. వరదల సమయంలో తాను ఇక్కడికి వచ్చి ఉంటే అధికారులు తన చుట్టూ తిరిగేవారని.. అప్పుడు ప్రజలకు మంచి జరిగేది కాదని, అందుకే అధికారులకు వారం రోజుల టైం ఇచ్చి ఆ తర్వాత వచ్చానన్నారు. ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కనపెట్టాలన్న జగన్.. సీఎం అంటే ఇలా చేయాలన్నారు. ప్రభుత్వ సాయం అందిందని బాధితులే చెబుతుంటే తనకు సంతోషంగా ఉందన్నారు.
కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి లంక గ్రామంలో సీఎం జగన్ ఇంటింటికి తిరిగి వరద బాధితులను పరామర్శించారు. వరద బాధితులందరినీ ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని సీఎం జగన్ తెలిపారు. ఏ వరద బాధితుడికి సహాయం అందలేదనే మాట రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గంటి పెదపూడి లంక గ్రామానికి అవసరమైన బ్రిడ్జి నిర్మాణం చేపడతామన్నారు. ఏ సీజన్ లో ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ఆ సీజన్‌లోనే పరిహారం అందజేస్తామన్నారు. పశువులకు ఎటువంటి కష్టం రాకుండా చర్యలు చేపడతామన్నారు. గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేయిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
పుచ్చకాయలవారి పేటలో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా నక్కా విజయలక్ష్మి కుటుంబాన్ని పరామర్శిస్తుండగా సీఎం జగన్ జేబులోంచి 8 నెలల బాబు పెన్ తీసుకున్నాడు. దీంతో ఆ చిన్నారికి సీఎం జగన్ తన పెన్నును బహుమతిగా ఇచ్చారు.
ట్రాక్టర్‌పై లంక గ్రామాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్

లంక గ్రామాల్లో గోదావరి వరద బాధితులను పరామర్శించేందుకు జగన్ పంటుపై ప్రయాణిస్తున్నారు.
- పి.గన్నవరం మండలం జి.పెదపూడి చేరుకున్న సీఎం జగన్
- జి. పెదపూడిలో కురుస్తున్న భారీ వర్షం
- వర్షంలోనే వరద బాధితులకు వద్దకు వెళ్లిన సీఎం జగన్
కోనసీమ జిల్లా: ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్న పి.గన్నవరం మండలం గంటిపెదపూడిలో భారీ వర్షం కురుస్తోంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించేందుకు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా జగన్ బయలుదేరారు.
ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సీఎం జగన్ బయలుదేరతారు. ఉదయం 10:30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి గ్రామానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు పుచ్చకాయల వారిపేటలో వరద బాధితులతో సమావేశం అవుతారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నారు.