Site icon NTV Telugu

Andhra Pradesh: బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

ఏపీలో బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. మార్చి 7 నుంచి బడ్జెట్ సమావేశాలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మార్చి నెలాఖరు వరకు సమావేశాలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. సుమారు 15 నుంచి 20 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. మార్చి 7న తొలిరోజు సమావేశాల్లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల అసెంబ్లీ సంతాపం వ్యక్తం చేయనుంది.

మార్చి 8న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. మార్చి 11 లేదా 14న అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రూ.2.30 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బడ్జెట్‌ రూపకల్పనపై ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించగా.. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది. కాగా ప్రస్తుత బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version