Ketireddy Vs JC: స్థానిక సంస్థల వేళ అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ మాజీ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తన హత్యకు వారిద్దరూ కుట్ర చేశారని ఆరోపించారు. తాడిపత్రిలోని తన ఇంటిపై సుమారు 500 మందితో దాడి చేయించారని పేర్కొన్నారు. ఇక, తాడిపత్రి డీఎస్పీ చంద్రశేఖర్ జేసీ ప్రభాకర్ రెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన ఇంటిపై పెట్రోల్ బాంబులు వేస్తే వాటిని క్రాకర్స్‌గా పేర్కొంటూ డీఎస్పీ వాస్తవాలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పోలీసుల వ్యవహారశైలిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని కేతిరెడ్డి ఆరోపించారు. వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రాజకీయ కక్షతో పోలీసులను ఉపయోగించుకోవడం సరికాదని విమర్శించారు. జేసీ కుటుంబం తమపై చేస్తున్న అరాచకాలను ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటామని కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. చేసిన పనులకు కర్మ ఫలితం కచ్చితంగా ఉంటుందనే విషయాన్ని జేసీ గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. తాడిపత్రిలో జరుగుతున్న పరిణామాలపై తన పోరాటం కొనసాగిస్తానని తెలిపారు.
బాధితులకు జేసీ పరామర్శ
మరోవైపు తాడిపత్రి ఘటనలో గాయపడిన వారిని మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అర్ధరాత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన అనంతపురం ఎస్పీ జగదీష్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎస్పీ తమపై కక్ష కట్టారని ఆరోపించారు. గత రెండున్నరేళ్లుగా ఎన్ని ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. గతంలో 420 సెక్షన్ కింద తనపై, తన కుమారుడిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారని జేసీ గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం ఎన్ని సెక్షన్ల కింద కేసులు నమోదవుతున్నా సంబంధిత వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో 420 కేసులో తనను, తన కొడుకును అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
పెద్దారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
పెద్దారెడ్డిపై 307 సెక్షన్ ఉందని చెబుతూ ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. పెద్దారెడ్డిపై ఎస్పీ జగదీష్‌కు అంత ప్రేమ ఎందుకని వ్యాఖ్యానించారు. పోలీసుల వ్యవహారశైలిలో సమానత్వం కనిపించడం లేదని విమర్శించారు. అలాగే తన మనుషులైన ముచ్చుకోట సుదర్శన్, బైరెడ్డి కనిపించడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి ఘటన నేపథ్యంలో పోలీసుల చర్యలు, ఎస్పీ వ్యవహారశైలిపై ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

