అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయి.. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. వెంటనే స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మృతులంతా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన వారు. తిమ్మంపేట వద్ద అరటి తోటలో కూలి పని నిమిత్తం వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో తలగాసిపల్లి క్రాస్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మృతులు: తాతయ్య, చిన్ననాగమ్మ, రామాంజినమ్మ, పెద్దనాగమ్మ.. చికిత్స పొందుతూ మృతి చెందిన వారు: చిన్ననాగన్న, కొండమ్మ, జయరాం.
Read Also: Ambati Rambabu: వారి చెప్పు చేతల్లో పోలీసు వ్యవస్థ పని చేస్తున్నట్లు కనిపిస్తుంది..
అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం ఇచ్చారు. మరోవైపు.. ఈ ఘటనపై రవాణా శాఖమంత్రి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి రాంప్రసాద్ వైద్యులకు సూచించారు.
Read Also: IPL 2025 Auction: ఐపీఎల్ వేలంలో ఈ విదేశీ ఆల్ రౌండర్లపై కానక వర్షం కురవనుందా?