Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్‌ ఎఫెక్ట్‌.. NH-16పై వాహనాల రాకపోకలు బంద్

Nh 16 Traffic

Nh 16 Traffic

Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్‌ తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ కోసం అనకాపల్లి జిల్లా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి రాత్రి 9 గంటల తర్వాత జాతీయ రహదారి-16 (NH-16)పై వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్‌ ప్రభావంతో రాత్రి వేళ పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా పోలీసు శాఖ వెల్లడించింది. తుని వైపు నుంచి అనకాపల్లి మీదుగా వెళ్లే వాహనాలతో పాటు, విశాఖపట్నం, సబ్బవరం మీదుగా తుని వైపు వెళ్లే అన్ని రకాల వాహనాల రాకపోకలను రాత్రి 9 గంటల తర్వాత తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.

హైవేపై పోలీసుల పర్యవేక్షణ
రవాణా ఆంక్షలు అమలయ్యే జాతీయ రహదారి పరిధిలోని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (SHOs), హైవే పెట్రోలింగ్, మొబైల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేసేలా పర్యవేక్షించాలని సూచించారు. తుఫాను సమయంలో వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగం తెలిపింది.

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు
తుఫాను తీరం దాటే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. వాహనదారులు పోలీసుల ఆదేశాలను పాటిస్తూ, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. తుఫాను కారణంగా ఏదైనా ఆపద ఎదురైనా, అత్యవసర సహాయం అవసరమైనా ప్రజలు వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలని జిల్లా పోలీసు శాఖ తెలిపింది. ఇందుకోసం డయల్ 112 లేదా 100 అత్యవసర నంబర్లకు ఫోన్ చేయవచ్చు. అలాగే అనకాపల్లి జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 94409 04229ను సంప్రదించి సహాయం పొందవచ్చని అధికారులు సూచించారు. తుఫాను ప్రభావం తగ్గి, పరిస్థితులు అనుకూలించే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసు శాఖ జారీ చేసే సూచనలను పాటించాలని జిల్లా పోలీసు యంత్రాంగం కోరింది.