అమూల్ సంస్థ పాల ధరలను మరోసారి పెంచింది. తన అన్ని రకాల పాల ధరలను పెంచుతున్నామని సోమవారం ప్రకటించింది. లీటర్ పాలపై రూ.4 పెంచుతున్నట్లు వెల్లడించింది. పెంచిన ధరలను మార్చి 1 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపింది. అమూల్ సంస్థ గోల్డ్, తాజా, శక్తి, టీ స్పెషల్ లాంటి వేరియంట్లలో పాల ప్యాకెట్లను ఉత్పత్తి చేస్తోంది. అమూల్ గోల్డ్ అరలీటర్ ప్యాకెట్ ప్రస్తుతం రూ.28గా ఉండగా మార్చి 1 నుంచి రూ.30కి పెరగనుంది.
మరోవైపు అమూల్ తాజా అరలీటర్ ప్యాకెట్ ధర రూ.22 నుంచి రూ.24కి చేరింది. అమూల్ శక్తి అరలీటర్ ప్యాకెట్ ధర రూ.25 నుంచి రూ.27కి పెరిగింది. ఇంధన ధరలు, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్, పశువుల దాణా ధరలు పెరగడంతో పాల ఉత్పత్తి ఖర్చు పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అమూల్ ప్రతీ ఏటా నాలుగు శాతం పాల ధరల్ని పెంచుతోంది. చివరి సారిగా జూలై 2021లో అమూల్ పాల ధరలు పెరిగాయి. దాదాపు 7 నెలల 27 రోజుల తర్వాత మరోసారి అమూల్ పాల ధరలు పెరగబోతున్నాయి. ఇప్పటికే క్రూడాయిల్ ధరలు, నిత్యావసర ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తుండగా ఇప్పుడు పాల ప్యాకెట్ ధరలు కూడా భారంగా మారనున్నాయి.
