Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!

Bolishetti Srinivas

Bolishetti Srinivas

Bolishetti Srinivas: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన అమలాపురం పార్లమెంట్ జనసేన కార్యకర్తల సమావేశంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాపు సామాజిక వర్గం, జనసేన పార్టీ భవిష్యత్ వ్యూహం, స్థానిక సంస్థల ఎన్నికల ప్రాధాన్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు బొలిశెట్టి.. స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని జనసేన శ్రేణులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునివ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్వహించిన అమలాపురం పార్లమెంట్ జనసేన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాపులు లేని రాజకీయాలు లేవని, పవన్ కల్యాణ్‌ లేకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఉండవని అన్నారు. పవన్ కల్యాణ్‌ నాయకత్వం వల్లే కాపు సామాజిక వర్గానికి విలువ పెరిగిందని పేర్కొన్నారు. కోనసీమలో కాపులు అధిక సంఖ్యలో ఉన్నందున వారిని కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో అమలాపురంలో కులాల పేరుతో విభజనలు సృష్టించారని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు బలం ఉన్న ప్రాంతాల్లో పార్టీ తప్పకుండా పోటీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2029 ఎన్నికల నాటికి జనసేన బలాన్ని 50 నుంచి 60 అసెంబ్లీ స్థానాల స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. స్థానిక సంస్థల్లో పార్టీ బలోపేతం అయితేనే భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించగలమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు పట్టుకొమ్మల్లాంటివని పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై విస్తృతంగా చర్చించారు.