ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అంబటి రాంబాబు తొలిసారి పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ ప్రాజెక్ట్‌పై అవగాహన పెంచుకోవడం కోసమే క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందని ఆయనన్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పెడెప్పుడు పూర్తవుతుందా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, అయితే వరద ఉధృతి కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అవుతోందని అన్నారు.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, తొందరపాటు చర్యల వల్ల ఆ వాల్ దెబ్బతిందని చెప్పిన రాంబాబు.. ఆ సమస్యని పరిష్కరించిన వెంటనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వేగవంతం అవుతుందని అన్నారు. ప్రపంచంలో, దేశంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న సందర్భాలు ఏవీ లేవని, ఒక్క పోలవరం విషయంలో మాత్రం ఇలా జరిగిందని తెలిపారు. ఆ వాల్ పునర్నిర్మాణం చేసే అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం కావడంతో, వ్యయం మరింత పెరుగుతుందని వెల్లడించారు. అవగాహన లోపం, ఏదో చేయాలనే తాపత్రయంతో చంద్రబాబు ఈ ప్రాజెక్ట్‌కి నష్టం కలిగించారని ఆరోపించారు.
కాగా.. గురువారం ఉదయమే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న అంబటి రాంబాబు స్పిల్ వే మీద ఏర్పాటు చేసిన గ్యాలరీలో ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. మంత్రి వెంట పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ యం.వి.ఎస్.నాగిరెడ్డి, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఆర్డీవో ఝాన్సి రాణీ పాల్గొన్నారు.