పోలవరం ప్రాజెక్టు విషయంలో కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా, మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా మాజీ మంత్రి దేవినేని ఉమ ఓ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ పార్టీ పరంగా వివాదాస్పదం కావడంతో దేవినేని ఉమా వెంటనే దానిని డిలీట్ చేశారు. అయితే ఈ విషయాన్ని మంత్రి అంబటి రాంబాబు పసిగట్టేశారు. దీంతో దేవినేని ఉమ ఆ ట్వీట్ ఎందుకు డిలీట్ చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇంతకీ దేవినేని ఉమ తన ట్వీట్‌లో ఏం రాశారంటే.. ‘ఒక్కచోట కూడా గెలవని సన్నాసులు మాకు ఆప్షన్లు ఇవ్వడం చూస్తుంటే ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి వెళతాను అన్నది అంట’ అని పోస్ట్ చేశారు. ఆదివారం నాడు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశంలో వచ్చే ఎన్నికలకు సంబంధించిన పవన్ కళ్యాణ్ పొత్తులపై మూడు ఆప్షన్‌లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్ గురించి తాజాగా మంత్రి అంబటి రాంబాబు మాజీ మంత్రి దేవినేని ఉమను సూటిగా నిలదీశారు. ఈ ట్వీట్ పెట్టి డిలీట్ చేసిన మాట వాస్తవమా.. కాదా? ధైర్యముంటే చెప్పు ఉమ అని అంబటి ప్రశ్నించారు.
ఈ ట్వీట్ పెట్టి,డిలీట్ చేసిన మాట
వాస్తవమా, కాదా ? ధైర్యముంటే చెప్పు @DevineniUma pic.twitter.com/dC94JWtHH3— Ambati Rambabu (@AmbatiRambabu) June 6, 2022