Site icon NTV Telugu

Ambati Rambabu: చంద్రబాబు, దేవినేని ఉమాకు సవాల్.. చర్చకు సిద్ధమా?

Ambati Challenges Babu Uma

Ambati Challenges Babu Uma

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలోని తప్పిదాలపై చర్చకు రావాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవినేని ఉమాలకు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. డయాఫ్రమ్ వాల్ ఎవరి చర్య వల్ల దెబ్బ తిందో చర్చ జరిగి తీరాల్సిందేనని ఆయన ముక్తకంఠంతో అన్నారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టడం చారిత్రక తప్పిదమన్న రాంబాబు.. ఆ తప్పు వల్లే వరదలకు వాల్ దెబ్బతిందన్నారు. దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్‌కు మరమ్మత్తులు చేపట్టాలా? లేక కొత్తది నిర్మించాలా? అనే విషయంపై దేశంలో ఉన్న మేధావులు తలలు పట్టుకుంటున్నారని చెప్పారు.

ఫలానా సమయంలో లోపు పోలవరం ప్రాజెక్ట్‌ని పూర్తి చేస్తామని చెప్పలేమన్న అంబటి రాంబాబు.. దశల వారిగానే ఏ ప్రాజెక్టైనా పూర్తవుతుందని వివరణ ఇచ్చారు. మొదటి దశ పూర్తి చేయడానికి తాము సాయశక్తులా ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేసి, ఎన్నికలకు వెళ్తామని చెప్పిన చంద్రబాబుకు.. ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో ఆలస్యం ఎందుకు జరుగుతోందో సమాధానం చెప్పాలా? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందోనని అడిగే హక్కు టీడీపీ నేతలకు ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట నుంచి గోదావరి డెల్టాకు నీరు విడుదల చేసిన సందర్భంగా అంబటి రాంబాబు పై విధంగా స్పందించారు.

అనుకున్న విధంగానే తాము జూన్ 1న నీటిని విడుదల చేశామని.. నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే విపత్తుల్ని ఎదుర్కునేందుకు ముందుగానే నీటిని సిద్ధం చేశామని అంబటి రాంబాబు అన్నారు. నారుమల్లు వేసుకోడానికి రైతులకు వీలుగా ఉంటుందని సూచించారు. పోలవరం ప్రాజెక్ట్ పనులకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే సమస్యల్ని పరిష్కరించి ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.

Exit mobile version