AP Local Body Elections: నామినేషన్ల నుంచి ఏకగ్రీవాల వరకు వివాదాలు.. ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు

Lella Appi Reddy

Lella Appi Reddy

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.. ఈ నేపథ్యంలో నామినేషన్లు, ఏకగ్రీవాలు, అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణలు, ఎన్నికల అధికారుల వ్యవహారశైలిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ)కు ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, ఇతర పార్టీ నేతలు ఎస్ఈసీని కలిసి తమ అభ్యంతరాలను వివరించారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ పార్టీ మొదటి నుంచీ పోరాటం చేస్తోందని, అయితే క్షేత్రస్థాయిలో ఎన్నికల నిబంధనలు అమలు కావడం లేదని ఆరోపించారు.

బలవంతపు ఏకగ్రీవాలు..!

ఎస్ఈసీని కలిసిన అనంతరం వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఏకగ్రీవాల పేరుతో ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘం నిబంధనలను క్షేత్రస్థాయిలో అధికారులు అమలు చేయడం లేదని, అప్పీళ్లకు వెళ్లినా న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ), నో డ్యూస్ పత్రాలు అవసరం లేదని నిబంధనలు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అధికారులు వాటిని పట్టించుకోవడం లేదని అప్పిరెడ్డి ఆరోపించారు. డ్వాక్రా రుణాల వివరాలు రాయలేదని, భార్య ఆస్తుల వివరాలు సమర్పించలేదని చెప్పి అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘం ఇచ్చే ఆదేశాలను కూడా అధికారులు ఖాతరు చేయడం లేదని అన్నారు.

ఆర్వోలు, ఈఆర్వోలపై తీవ్ర విమర్శలు

రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వోలు) టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అప్పిరెడ్డి ఆరోపించారు. బీఫారాలు సమర్పించినప్పుడు అక్నాలెడ్జ్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శించారు. టీడీపీతో పాటు నిర్వీర్యమయ్యాయని తాము భావిస్తున్న రెవెన్యూ, పోలీసు వ్యవస్థలపై కూడా పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఇక, తమ పార్టీ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. నకిరేకల్‌లో హనుమాయమ్మ భర్తను పోలీసులు అర్ధరాత్రి తీసుకెళ్లారని పేర్కొన్నారు. రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నం జెడ్పీటీసీ అభ్యర్థి కొక్కిలిగడ్డ భూలక్ష్మి కుమారుడిపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు.. నగరి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో ఉపసంహరణ గడువు పూర్తికాకముందే ఎన్నికైనట్లు డిక్లరేషన్ ఇచ్చారని, రాజంపేటలోనూ చైర్మన్ ఎన్నిక విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట మంచం వేసుకుని పడుకుంటారని వ్యాఖ్యానిస్తూ, ఎన్నికల వ్యవస్థలో నిష్పక్షపాతంపై ప్రశ్నలు లేవనెత్తారు లేళ్ల అప్పిరెడ్డి..

2029లో ఓటమి భయంతోనే కుట్రలు..!

మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీడీపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. 2029 ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఆందోళనతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నారని విమర్శించారు. 2029 నాటికి టీడీపీ చీలిపోతుందని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరిలో మార్పు వస్తే ప్రభుత్వం కూలిపోతుందంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి రాజకీయ విమర్శలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే టీడీపీ పరిస్థితి మారిపోతుందంటూ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో వైసీపీ చేస్తున్న పోరాటాన్ని కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల తిరస్కరణలు, ఏకగ్రీవాలు, ఎన్నికల అధికారుల వ్యవహారశైలిపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ అంశాలపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.