Gadikota Srikanth Reddy: ‘ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు’.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్

Gadikota Srikanth Reddy

Gadikota Srikanth Reddy

Gadikota Srikanth Reddy: కూటమి సర్కార్‌, సీఎం చంద్రబాబు నాయుడపై వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వయస్సు పెరిగినా తన రాజకీయ ధోరణిలో మార్పు రాలేదని, ఏ సభకు వెళ్లినా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు డబుల్ స్టాండర్డ్స్ మార్చుకోవాలని సూచించారు. విదేశాల నుంచి భారీ పెట్టుబడులు వస్తున్నాయని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని, ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.6,900 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. ప్రకటించిన 10 పరిశ్రమల్లో కేవలం రెండు మాత్రమే పురోగతిలో ఉన్నాయని, వాటి ద్వారా సుమారు 25 వేల ఉద్యోగాలే వచ్చే అవకాశం ఉందని అన్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు పారిపోయాయని చేసిన ప్రచారం అవాస్తవమని గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వైసీపీ ప్రభుత్వం నంబర్ వన్ స్థానంలో ఉండేదని, ప్రస్తుతం రాష్ట్రం ఎనిమిదో స్థానానికి పడిపోయిందని చెప్పారు. గతంలో తయారీ రంగంలో దక్షిణ భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్నామని, తాము ఆధారాలతోనే మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చిన్న, మధ్య, భారీ పరిశ్రమలు అనేకం మూతపడ్డాయని, జీఎస్టీ ఆదాయాల్లో కూడా రాష్ట్రం తన స్థానం కోల్పోయిందని ఆరోపించారు. రూ.61 వేల కోట్ల రెవెన్యూ లోటుతో ఉన్న రాష్ట్రం దేశంలో మరొకటి ఉండదన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3.32 లక్షల కోట్ల అప్పులతో సంక్షేమ పథకాలు అమలు చేసిందని, ప్రస్తుతం ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.3.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. అలాగే 95 శాతం పూర్తయిన రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆరోపించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి..