Site icon NTV Telugu

YS Jagan: వారికి అభినందనలు తెలిపిన జగన్‌.. కూటమి సర్కార్‌పై ఫైర్‌

Ys Jagan

Ys Jagan

YS Jagan: కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. ఏ అంశాన్ని కూడా వదలకుండా.. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఇక, యువత పోరు పేరిట జరిగిన నిరసన కార్యక్రమాలపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు వైఎస్‌ జగన్.. ‘యువత పోరు’ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారికి అభినందనలు తెలుపుతూనే.. కూటమి సర్కార్‌పై విరుచుకుపడ్డారు.. ‘చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తమకు చేస్తున్న మోసాలు, ఎగరగొడుతూ నిర్వీర్యం చేస్తున్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు, పలు సమస్యలపై వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువతీయువకులు “యువత పోరు’’ పేరిట రోడ్డెక్కి తమ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం కళ్లు తెరిచేలా బ్రహ్మాండంగా చేపట్టినందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నిరసన కార్యక్రమంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై నిన్న నరసరావుపేటలో పోలీసుల లాఠీఛార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాను.’

Read Also: Indian Railways: రైల్వే టికెట్‌ ఛార్జీల పెంపు.. ఎంతంటే..?

మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా ప్రతి ఇంటికీ వెళ్లి వివిధ రకాలుగా బాండ్లు పంచారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు, యువకులు ఉన్నారో అంతమందికీ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేల చొప్పున ఇంత వస్తుందని లెక్కలు వేసి మరీ, బాండ్లు ఇచ్చారు. చంద్రబాబుగారు అధికారంలోకి రాగానే ఆ మేరకు జూన్‌ -2024 నుంచి వారి వారి ఖాతాల్లో జమ అవుతుందని, ప్రజలకు బాండ్లు రాసిమరీ ఇచ్చారు. టీడీపీ అధికార గెజిట్‌ ఈనాడు దినపత్రికలో రాష్ట్రంలో ఉపాధికోసం, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు కోటిన్నరపైనే ఉన్నారని రాస్తే, మీ మేనిఫెస్టో, మీరు ఇంటింటికీ పంచిన బాండ్ల ప్రకారం నెలకు రూ.3వేల చొప్పున ఈ ఏడాది కాలంలో మీరు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఒక్కరికీ ఇవ్వకపోగా, ఈ ఏడాది మళ్లీ ఎగరగొట్టే మోసానికి దిగారు అంటూ దుయ్యబట్టారు జగన్..

మరోవంక 2024 జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి విద్యాదీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అదే సంవత్సరం 2024లో చెల్లింపులు చేయాలి. ఎన్నికల కారణంగా అది నిలిచిపోయింది. అప్పటినుంచి ఈ జూన్‌-2025వరకూ 6 త్రైమాసికాలుగా మొత్తంగా రూ.4,200 కోట్లు పెండింగ్‌. ఇందులో ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. వసతి దీవెన కింద ఏప్రిల్‌-2024న చెల్లించాల్సిన ఒక విడత, ఈ ఏడాది ఏప్రిల్-2025 లో చెల్లించాల్సిన మరో విడత కలిపి రూ.2,200కోట్లు పెండింగ్‌. మొత్తంగా రూ.6,400 కోట్లకు గానూ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మీరు ఇవ్వకపోవడంతో ఇవాళ విద్యార్థులు చదువులు మానుకుని, పనులకు పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి అన్నారు జగన్… చంద్రబాబుగారూ మీరు చేయాల్సింది చేయకుండా, ఎగరగొట్టినందుకు ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదంతో అణగదొక్కే ప్రయత్నంచేస్తున్నారు. వీళ్లంతా చేసిన తప్పేమిటి? కేవలం కలెక్టర్‌ను కలిసి డిమాండ్ పత్రం ఇవ్వాలనుకోవడం తప్పా? మీరు ఇస్తామన్న వాటికోసం కూడా డిమాండ్‌ చేయడం తప్పా? మీ రెడ్‌బుక్‌ రాజ్యాంగ పాలనకు నిన్న నరసరావుపేటలో జరిగిన ఘటన నిదర్శనం కాదా? రోజురోజుకూ మీ అబద్ధాలు, మీ మోసాలు, మీ దౌర్జన్యాలు, మీరు చేస్తున్న పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోండి. అంటూ ట్వీట్‌ చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌..

Exit mobile version