YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్‌ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే

Ys Jagan Speech

Ys Jagan Speech

YS Jagan: తాజా రాజకీయ పరిణాలు, రాష్ట్రంలోని పరిస్థితులు.. స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిసారించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కీలక సమావేశానికి సిద్ధం అయ్యారు.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వేదికగా ఇవాళ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న కరువు పరిస్థితులు, నీటి ఎద్దడి, సాగునీరు, తాగునీటి సమస్యలపై జిల్లాల వారీగా సమీక్షించే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నీటి లభ్యత వంటి అంశాలపై జిల్లా అధ్యక్షుల నుంచి జగన్ వివరాలు తెలుసుకోనున్నారు.

అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఎన్నికలకు పార్టీ శ్రేణులను ఎలా సిద్ధం చేయాలి, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను ఎలా బలోపేతం చేయాలనే అంశాలపై జిల్లా అధ్యక్షులతో జగన్ చర్చించనున్నారు. పార్టీ బలోపేతం, జిల్లాల వారీగా సంస్థాగత పరిస్థితులు, నాయకులు-కార్యకర్తల సమన్వయం వంటి అంశాలపైనా వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా నేతలతో చర్చించి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం.