NTV Telugu Site icon

YS Jagan: ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ.. జగన్‌ సంచలన వ్యాఖ్యలు

Jagan

Jagan

YS Jagan: వరుసగా వివిధ జిల్లాల నేతలతో సమావేశమవుతూ వస్తున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. టీడీపీ నాయకులు గ్రామాల్లోకి, ఇంటింటికీ వెళ్లే పరిస్థితులు లేవని.. హామీలు నిలబెట్టుకోకపోతే చొక్కాలు పట్టుకోవాలని వాళ్లే అన్నారు.. బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అన్నారు.. ఇప్పుడు బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ అయ్యిందని ఆరోపించారు.. ప్రజలు కాలర్‌ పట్టుకునే పరిస్థితి వచ్చింది.. రాష్ట్రంలో స్కాంలు తప్ప ఏమీ జరగడంలేదు.. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం తప్ప ఏమీ లేదు.. ఇసుక స్కాం, లిక్కర్‌ స్కాంలు చేస్తున్నారు.. యథేచ్ఛగా పేకా క్లబ్బులు నడుస్తున్నాయి.. తీవ్రవాదులుపెట్టే కేసులు పెట్టి వేధించి జైళ్లలో పెట్టారని మండిపడ్డారు.. అయితే, చట్టవిరుద్ధంగా, అన్యాయాలు చేసేవారెవ్వరినీ వదిలిపెట్టబోమని వార్నింగ్‌ ఇచ్చారు.. తప్పు చేసినవారిని చట్టంముదు నిలబెడతామని ప్రకటించారు.

Read Also: Pamban Bridge : ప్రారంభానికి సిద్ధంగా కొత్త పంబన్ బ్రిడ్జీ.. 30 నిమిషాల దూరం కేవలం 5 నిమిషాల్లోనే

మన పరిపాలనలో రెండున్నర సంవత్సరాలు కోవిడ్‌ ఉంది.. అందుకే కార్యకర్తలకు చేయాల్సింది చేయలేకపోయాం అన్నారు వైఎస్‌ జగన్‌.. 2019-24 మధ్య జగన్ 1.O ప్రభుత్వం నడిచింది.. చరిత్రలో ఎప్పుడూ చూడనివిధంగా వైసీపీ పాలన సాగింది.. ఎలాంటి లంచాలకు తావులేకుండా 2.71 లక్షల కోట్ల డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం.. కానీ, చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎగరగొట్టారు.. మేనిఫెస్టోను చెత్తబుట్టలోకి విసిరేశారని విమర్శించారు.. ఇక, జగన్‌ 2.Oలో ప్రతి కార్యకర్తకూడా తోడుగా ఉంటాం.. వాళ్ల ఇంటి పెద్దన్నగా వారికి తోడుగా ఉంటాను అని భరోసా కల్పించారు.. మార్చి నాటికి స్థానిక సంస్థలకు నాలుగేళ్ల పదవీకాలం ముగియబోతోంది.. తమ వాళ్లని పదవుల్లో కూర్చోబెట్టడానికి ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ప్రయత్నిస్తారు.. మన వాళ్లను భయపెట్టడానికి, లొంగ దీసుకోవడానికి, ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తారు.. రాబోయే రోజుల్లో మరిన్ని దొంగకేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు.. ఎల్లకాలం పరిస్థితులు ఇలాగే ఉండిపోవు.. రాబోయే మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తామని తెలిపారు జగన్..

Read Also: Kamal Haasan: కమల్ హాసన్‌కు ప్రమోషన్.. త్వరలో రాజ్యసభలోకి ఎంట్రీ!

మొన్నటి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది.. టీడీపీకి సభ్యులు లేకపోయినా దాడులు చేసి భయపెట్టారు, ప్రలోభ పెట్టారు.. అన్యాయాలు చేసి గెలిచామంటూ గొప్పగా చెప్పుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు జగన్‌.. మన ప్రభుత్వంలో టీడీపీ రెండే రెండు మున్సిపాల్టీలు గెలిచింది.. మనం గట్టిగా తుమ్మి ఉంటే ఆ రెండు కూడా వారికి వచ్చి ఉండేవి కావని.. కానీ, మనం ప్రజాస్వామ్యానికి కట్టుబడి, ఆ ఫలితాలను గౌరవించాం.. టీడీపీ తప్పుడు సంప్రదాయాలకు పాల్పడుతోందన్నారు.. కార్యకర్తలు గొప్పగా చెప్పుకునేలా నాయకత్వం ఉండాలి.. ముసలమ్మకూడా బటన్లు నొక్కుతుందని చంద్రబాబు అన్నారు.. ఇప్పుడు ఎలా నొక్కాలో చెవిలో చెప్పాలంటున్నారు.. మొహమాటం లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు.. మరి ఈవ్యక్తి చీటర్‌ కాదా..? అని ప్రశ్నించారు.. ప్రజలను మోసం చేసిన వ్యక్తిపై 420 కేసు పెట్టకూడదా..? అని వ్యాఖ్యానించారు.. ఇక, తిరోగమనంలో విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు ఉన్నాయి.. చంద్రబాబు చెప్పిన ప్రతి పథకం అబద్ధం, మోసం.. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి 40శాతం ఓట్లు వచ్చాయి.. 10శాతం ఓట్లు తగ్గటానికి కారణం వారిలా నేను అబద్ధాలు చెప్పలేకపోయాను అన్నారు.. జగన్‌.. కార్యకర్తలు, ప్రజలందరి మనసులో ఉన్నాడు. ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కినా మనకే ఈ పరిస్థితి ఉంటే.. రేపు ఇచ్చిన మాటను గాలికొదిలేసిన ఈ ప్రభుత్వంలో ఉన్నవారి పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌..