YS Jagan: ఎంపీ మిథున్‌రెడ్డికి జగన్ ఫోన్‌.. ఎన్నికల్లో ధైర్యంగా పోరాడతాం.. న్యాయపోరాటం చేస్తాం..

Jagan Mithun

Jagan Mithun

YS Jagan: ఈ రోజు జరిగిన దాడి ఘటనకు సంబంధించి వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఫోన్‌ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్న ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని జగన్‌ ఆరోపించారు. తన రెండున్నరేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అందుకే దాడులు, అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. హింసాత్మక రాజకీయాలు చంద్రబాబుకు కొత్తేమీ కాదని జగన్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని జంగిల్‌ రాజ్‌లా మార్చేశారని ఆరోపించారు. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ నాయకుడిగా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డికే భద్రత లేని పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసు వ్యవస్థ నిస్తేజంగా ఉండిపోతోందని జగన్‌ ఆరోపించారు. ఈ అన్యాయాలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. న్యాయపరంగా, చట్టపరంగా అన్ని మార్గాల్లో పోరాటం చేస్తామని తెలిపారు. ధైర్యంగా, సహనంతో ఎన్నికలను ఎదుర్కొంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తామని జగన్‌ వెల్లడించారు. ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు పారామిలటరీ బలగాలను మోహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని కూడా కోర్టుల ముందు ఉంచుతామని చెప్పారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర తమదని జగన్‌ పేర్కొన్నారు. హింసాత్మక రాజకీయాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. ఎన్నికల సమయంలో దాడులు, అక్రమాలకు తావులేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.