Site icon NTV Telugu

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మాజీ మంత్రి.. బొత్స పేరును ప్రకటించిన జగన్‌

Botsa

Botsa

MLC Elections: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగనున్నారు.. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌.. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతలతో సమావేశమైన జగన్‌.. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.. ఆ తర్వాత బొత్సను తమ అభ్యర్థిగా ప్రకటించారు వైఎస్‌ జగన్‌..

Read Also: Love Harassment: ప్రేమ పేరుతో వేధింపులు.. మైనర్ బాలిక ఆత్మహత్య..

విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో.. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన వారితో ఈ రోజు క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో వైసీపీకి భారీ మెజార్టీ ఉన్న నేపథ్యంలో సహజంగా టీడీపీ పోటీకి పెట్టకూడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన జగన్‌.. కానీ, చంద్రబాబు ఏరోజూ నైతిక విలువలు పాటించే వ్యక్తి కాదన్నారు.. రకరకాల ప్రలోభాలు, బెదిరింపులతో అడ్డగోలుగా గెలవడానికి ఆయన ప్రయత్నిస్తారని విమర్శించారు.. కుయుక్తులు, కుట్రలు అనేవి చంద్రబాబు నైజం అంటూ ఫైర్‌ అయ్యారు.. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది.. అందుకే పార్టీలో అందరు నాయకుల అభిప్రాయాలు తెలుసుకోవడానికే ఈ సమావేశం నిర్వహించామన్నారు వైఎస్‌ జగన్‌..

Read Also: Wayanad Landslides : ఏడాది క్రితం స్కూల్ అమ్మాయి రాసిన కథే కేరళలోని వయనాడ్ లో నిజమైంది

ఇక, ఈ సమావేశంలో ఒక్కొక్కరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు వైఎస్‌ జగన్‌.. అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత.. బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.. సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని ఆదేశించారు.. అధికార పార్టీ నుంచి బెదిరింపులు ఉంటాయని, వాటిని ధీటుగా ఎదుర్కొనేలా అంతా కలిసి ముందుకు సాగాలని స్పష్టం చేశారు వైఎస్‌ జగన్‌. కాగా, ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో మొత్తం 822 మంది ఓటర్లు ఉన్నారు.. వీరిలో జడ్పీటీసీలు 36 మంది అయితే, ఎంపీటీసీలు 636, కౌన్సిలర్లు 53, కార్పొరేటర్లు 97, ఖాళీగా వున్న స్థానాలు 11గా ఉన్నాయి.. వీరాలో వైసీపీ బలం 600గా చెబుతున్నారు.. కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు 215 ఉండగా.. టచ్ లో వున్న వాళ్లతో కలిపి కూటమి బలం 275కు పైగా ఉందనే లెక్కలు వేస్తున్నారు.. దీంతో.. ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version