NTV Telugu Site icon

TDP Politburo Meeting: టీడీపీ పొలిట్‌బ్యూరో కీలక నిర్ణయం.. వారికే నామినేటెడ్‌ పోస్టులు..!

Tdp

Tdp

TDP Politburo Meeting: టీడీపీ పొలిట్‌బ్యూరో సమవేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశమైంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు.. కార్యకర్తలకు నామినేటెడ్‌ పదవులిచ్చి వారికి సముచిత స్థానం కల్పించాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించిందన్నారు.. పార్టీ కోసం పని చేసిన నేతలు.. కార్యకర్తలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని చంద్రబాబు సూచించారు. పార్టీ కోసం పని చేసినవారి జాబితా ఇప్పటికే పార్టీకి ఉంది. పార్టీ బలోపేతం కోసం పని చేసిన కార్యకర్తలకు మంచి స్థానం కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నాం. సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నాం అన్నారు.. ఇక, పోలవరం, అమరావతి నిర్మాణాలపై చర్చ జరిగింది. ఈ రెండు ప్రాజెక్టులను గత ప్రభుత్వం విధ్వంసం చేసింది. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రానికి జరిగే మేలు గురించి చర్చించాం.. కేంద్రం అందించిన సాయంపై పొలిట్‌ బ్యూరో హర్షం వ్యక్తం చేసిందన్నారు.

Read Also: Pawan Kalyan: అప్పుడు హీరో అడవులని కాపాడితే ఇప్పుడు చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు

మరోవైపు.. టీడీపీ హయాంలో పెండింగులో ఉన్న నీరు-చెట్టు బిల్లుల చెల్లింపులపై చర్చించామన్నారు పల్లా శ్రీనివాస్‌ రావు.. వైసీపీ చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే అంశం మీద మాట్లాడుకున్నామని వెల్లడించారు.. ఇక, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. జన్మభూమి-2 త్వరలో ప్రారంభం కాబోతోందన్నారు. జన్మభూమి-2లో ప్రజల భాగస్వామ్యం.. దాతల భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేలా ఉంటుంది. నామినేటెడ్‌ పోస్టుల్లో వడపోత జరుగుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేలా నామినేటెడ్‌ పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుందన్నారు. కూటమిగా గెలుపొందాం.. నామినేటెడ్‌ పోస్టుల భర్తీ విషయంలోనూ అందరి ఆమోదంతో కూర్పు చేయాల్సి ఉంటుంది. పొత్తుల వల్ల టిక్కెట్లు దక్కని వారికి.. సరైన పదవులు దక్కని సీనియర్లకు నామినేటెడ్‌ పదవుల భర్తీ జరగనుందన్నారు. త్వరలోనే నామినేటెడ్‌ పదవుల భర్తీకి సంబంధించిన తొలి జాబితా విడుదల చేస్తాం. చంద్రబాబు నాయకత్వం.. పవన్‌ కల్యాణ్‌ పట్టుదల అవసరమని ప్రజలు భావించారు. ప్రజారంజక పాలన సాగిస్తూ.. పార్టీని ప్రభుత్వానికి అనుసంధానం చేసేలా ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటాం. తొలి ఐదు సంతకాలతో చంద్రబాబు ప్రజల్లో గొప్ప నమ్మకాన్ని కల్పించగలిగారని పేర్కొన్నారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు.