AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు

Anil Chandra Punetha

Anil Chandra Punetha

AP Local Body Elections 2026: స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా సమావేశం నిర్వహించారు. మొత్తం 20 రాజకీయ పార్టీలకు ఆహ్వానం అందించగా, 19 పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికలను పారదర్శకంగా, చట్ట ప్రకారం నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వివిధ రాజకీయ పార్టీలు తమ సూచనలు, అభిప్రాయాలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో కుల ధృవీకరణ పత్రాలు, నో డ్యూ సర్టిఫికెట్ల జారీ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు. ఎన్నికల సమయంలో మద్యం నియంత్రణను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. అలాగే, దసరా ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల నిర్వహణకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు.. రాజకీయ పార్టీలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఈ అంశాలపై సంబంధిత జిల్లాల అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల విధానాలను తక్షణమే మార్చడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే, కలెక్టరేట్‌లో నామినేషన్ల స్వీకరణ అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. సంబంధిత శాఖల నుంచి గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసే అంశంపైనా ఆలోచిస్తామని తెలిపారు.

దసరా ఉత్సవాల నేపథ్యంలో ఎలాంటి ఎన్నికల సంబంధిత కార్యక్రమాలు చేపట్టకుండా ఉండే అంశాన్ని కూడా పరిశీలిస్తామని ఎస్ఈసీ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో సున్నిత ప్రాంతాలు, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. ఎన్నికల భద్రత కోసం పారామిలిటరీ దళాల మోహరింపు అంశాన్ని పోలీసు శాఖకు పంపినట్లు వెల్లడించారు. ఇక, రాజకీయ పార్టీలు చేసిన సూచనలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.