RK Roja: స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారని మాజీ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచేందుకు దొంగ నాటకాలు ఆడుతోందని ఆమె విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో ప్రతి చోటా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని స్పష్టం చేశారు.. వైసీపీ విస్తృతస్థాయి సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన రోజా.. గత ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేశారని రోజా ఆరోపించారు. ఎన్నికల సమయంలో జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించామని పేర్కొన్నారు.
ప్రజలు మంచి చేసిన వైఎస్సార్‌సీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో అండగా నిలవాలని భావిస్తున్నారని రోజా అన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో 45 లక్షల ఓట్లు తొలగించారని ఆమె ఆరోపించారు. అదే సమయంలో పాత ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోందని, తొలగించిన ఓట్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ.. జగన్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చినప్పుడు వాటిపై కోర్టులో కేసులు వేశారని రోజా ఆరోపించారు. రిజర్వేషన్లు లేకపోయినా బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చి గెలిపించుకున్నామని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు కొత్త జీవో పేరుతో మరోసారి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే బీసీలకు మరిన్ని సీట్లు ఇచ్చుకోవచ్చని అన్నారు.
ఇక, ఎన్డీఏ కూటమి అంటే నాటకాలు, అబద్ధాలు, డ్రామాలు ఆడే కూటమిగా రోజా అభివర్ణించారు. రెండున్నరేళ్లు దాటుతున్నా ఫేక్ మాటలతోనే కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలోనే ఓటర్లపై ప్రేమ చూపిస్తారని, రాష్ట్రాన్ని అప్పుల్లో నంబర్ వన్‌గా మార్చారని ఆరోపించారు. అప్పులు చేసిన నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియడం లేదని ప్రశ్నించారు. అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని రోజా ఆరోపించారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తన శాఖపై దృష్టి పెట్టడం లేదని, పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలోనూ విఫలమవుతున్నారని విమర్శించారు. హోం మంత్రి శాంతిభద్రతలపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. జగన్‌ను విమర్శించడానికే కొందరికి మంత్రి పదవులు ఇచ్చినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రోజా హెచ్చరించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయ ఆటలు ఆడతామని భావిస్తే కుదరదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా..

