Site icon NTV Telugu

AP Revenue Meetings: నేటి నుంచి రెవెన్యూ సదస్సులు.. అక్కడికక్కడే భూ సమస్యల పరిష్కారం..!

Ap Revenue Meetings

Ap Revenue Meetings

AP Revenue Meetings: రాష్ట్రంలో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇందుకోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. కోర్టులకు వెళ్లకుండా సర్కార్‌ పరిధిలో పరిష్కరించే సమస్యలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఇవాళ్టి నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో స‌ద‌స్సులు జరుగుతాయి. గత ప్రభుత్వ హయాంలో భూవివాదాలు పెరిగిపోయాయని.. కబ్జాలు, ఆక్రమణలు జరిగాయని.. ఆరోపిస్తోంది కూటమి ప్రభుత్వం.. అయితే, ఏపీలో భూ వివాదాలకు పరిష్కారం చూపేందుకు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 17,564 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో పరిష్కారం కాకుండా మిగిలిపోయిన వివాదాలపై ఇందులో చర్చించి.. తగు నిర్ణయాలు తీసుకోనున్నారు.

Read Also: Chhattisgarh: బీజేపీలో చేరినందుకు.. మాజీ సర్పంచ్‌లను కిడ్నాప్ చేసి చంపిన నక్సల్స్!

ఇవాళ ప్రారంభమై 33 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ సదస్సులు జరగనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో భూ వివాదాలు బాగా పెరిగినట్టు కూటమి సర్కార్‌ గుర్తించింది. అలాగే లెక్కకు మిక్కిలిగా వస్తున్న ఫిర్యాదుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. భూములకు సంబంధించిన అన్ని రకాల సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో ఫిర్యాదులు తీసుకుంటారు. వాటికి స్పాట్‌లోనే పరిష్కారం చూపనున్నారు. అలాగే, సదస్సుల్లో ఆయా గ్రామాలకు సంబంధించిన రికార్డుల్ని ప్రదర్శిస్తారు. అసైన్డ్, ప్రీ హోల్డ్, లీజ్, కేటాయింపు భూముల వివరాలు కూడా ప్రకటిస్తారు. మరోవైపు గతంలో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారుల్లో అనర్హుల ఏరివేతకు కూడా శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. అంతేకాకుండా అసైన్డ్, ప్రీ హోల్డ్ భూముల్లో అక్రమాలు జరిగాయా అన్నది కూడా రెవెన్యూ సదస్సులు ప్రత్యేకంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెబుతోంది ప్రభుత్వం. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 80 శాతం సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అంచనా వేస్తోంది సర్కార్‌.

Exit mobile version