Site icon NTV Telugu

MP Mithun Reddy: సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట.. అప్పటి వరకు అరెస్ట్‌ చేయొద్దు..!

Mp Mithun Reddy

Mp Mithun Reddy

MP Mithun Reddy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో ఏపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. ఇక, ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది.. ఇక, మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.. మిథున్ రెడ్డి తరఫున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వి.. ఈ పిటిషన్‌పై జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ ధర్మాసనం విచారణ జరిపింది.. కాగా, మద్యం అమ్మకాలపై సీఐడీ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు మిథున్ రెడ్డి..

Read Also: Andhra Pradesh: సంక్షేమ పథకాలు అమలు.. ఫీడ్‌ బ్యాక్‌లో షాకింగ్‌ విషయాలు..!

కాగా, మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ గత నెలలో హైకోర్టును ఆశ్రయించారు మిథున్‌రెడ్డి.. ఆ పిటిషన్‌పై విచారణ సమయంలో సీఐడీ తరుఫు న్యాయవాది మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని హైకోర్టుకు తెలియజేశారు.. ఎంపీ మిథున్‌రెడ్డిని నిందితుడిగా పేర్కొనలేదని చెప్పుకొచ్చారు.. దీంతో, ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్‌ చేసింది.. మరోవైపు.. మరుసటి రోజునే ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయనే ప్రచారం జరిగిన తరుణంలో.. ఎంపీ మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టులో ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయడం.. ఆ పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరగడంతో పాటు.. తదుపరి విచారణ వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు..

Exit mobile version