AP Legislative Council: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రోటోకాల్ వివాదం సద్దుమణిగింది.. మండలి చైర్మన్ కు ప్రోటోకాల్ విషయంలో జరిగిన పరిణామాలను దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని మంత్రి పయ్యావుల కేశవ్ హామీ ఇవ్వడంతో.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు శాంతించారు.. అంతేకాదు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ.. మరోవైపు, ఈ పరిణామాలపై స్పందించిన మండలి చైర్మన్ మోషేర్‌రాజు.. వ్యక్తులకు, వ్యవస్థలకు, అధికారులకు గౌరవం ఇవ్వాలని సూచించారు.. తన వ్యక్తిగత అంశాన్ని గుర్తించి లేవనెత్తిన ప్రతిపక్షం, స్పందించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు మండలి చైర్మన్ మోషేర్‌రాజు..
Read Also: AI Tools : విద్యార్థుల నైఫుణ్యాలను తగ్గిస్తున్న ChatGPT .. అధ్యయనంలో వెల్లడి..
కాగా, ఈ రోజు శాసనమండలి ప్రారంభం కాగానే, నిరసనకు దిగారు వైసీపీ సభ్యులు.. సభాపతి గౌరవాన్ని కాపాడాలని నినాదాలు చేశారు.. రాజ్యాంగ హక్కులను కాపాడాలంటూ ఆందోళనకు దిగారు.. సభానాయకుడు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. అయితే, వైసీపీ సభ్యుల నిరసనల మధ్య మండలికి 10 నిమిషాల విరామం ప్రకటించారు చైర్మన్.. ఇక, విరామం తర్వాత సభ తిరిగి ప్రారంభమైనా.. అదే పరిస్థితి కొనసాగింది.. మండలిలో కాఫీకి, అసెంబ్లీలో కాఫీకి తేడా ఉంటోందన్న వైసీపీ సభ్యులు ఆరోపించారు.. అసెంబ్లీ, మండలిలో ఒకేరకమైన కాఫీ, భోజనాలు లేవని సభ దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, ఇలాంటి తేడా ఎక్కడా లేదని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ వివరణ ఇచ్చారు.. ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగితే పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్.. ఇక, ప్రోటోకాల్ వివాదంపై కూడా పయ్యావుల కేశవ్ హామీ ఇవ్వడంతో ప్రోటోకాల్ వివాదం సద్దుమణిగింది..
