Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి పార్టీలు సత్తా చాటాయి.. ఈ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. పట్టణ, నగర ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనపై విశ్వాసం చూపించారని జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అన్నారు. ఈవీఎంల ద్వారా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనైనా, బ్యాలెట్ ద్వారా నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా ప్రజలు కూటమి పక్షానే నిలిచారని పేర్కొన్నారు. జనసేనకు పట్టణ, నగర ప్రాంతాల్లో లభిస్తున్న ఆదరణ ఎంతో విలువైనదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ తమ పరాజయానికి ఈవీఎంలను నిందించిందని పవన్ కల్యాణ్‌ గుర్తుచేశారు. అయితే ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించిన స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు కూటమికి అదే స్థాయిలో విజయాన్ని అందించారని అన్నారు. ఈ ఫలితాలు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, పాలనపై ప్రజలు వ్యక్తం చేస్తున్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.

మరోవైపు.. స్థానిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీకి అండగా నిలిచిన ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు పవన్‌ కల్యాణ్‌.. కూటమి పక్షాలకు అఖండ విజయాలు అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. జనసేనకు బలమైన మద్దతు ఇచ్చిన పట్టణ, నగర ఓటర్ల ఆదరణను పార్టీ ఎంతో విలువైనదిగా భావిస్తోందన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌..