NTV Telugu Site icon

Sand Online Booking: ఆన్‌లైన్‌లో ఉచిత ఇసుక బుకింగ్.. ఇక అన్నీ పోర్ట్‌లోనే..!

Sand

Sand

Sand Online Booking: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో ఇసుక దందా జరిగిందని ఆరోపిస్తూ వచ్చిన కూటమి నేతలు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా స్టాక్‌ను బట్టి ఇసుక సరఫరా కొనసాగిస్తున్నారు.. అయితే, ఇసుక సరఫరాలో మరింత పారదర్శకత తీసుకొచ్చే విధంగా ఆన్‌లైన్‌ విధానానికి శ్రీకారం చుడుతోంది చంద్రబాబు నాయుడు సర్కార్.. ఈరోజు నుంచి ఏపీలో ఇసుక ఆన్‌లైన్‌ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. వినియోగదారులు ఉచిత ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్‌ ఏర్పాటు చేసింది.

Read Also: UPI Lite: చిన్న లావాదేవీల కోసం సరికొత్త ఫీచర్.. ఎలా పని చేస్తుందంటే?

ఇవాళ్టి నుంచి ఏపీలో ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమల్లోకి రాబోతోంది.. ఉచిత ఇసుక పోర్టల్‌ను ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.. అధికారులు నుంచి ఇసుక రవాణాదారుల ఎవ్వరూ తప్పిదాలకు పాల్పడకుండా పోర్టల్ రూపకల్పనకు పూనుకుంది సర్కార్.. జిల్లా స్థాయిలో కలెక్టర్, అధికారుల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు.. ఇసుక స్టాక్ ఎంత ఉంది..? సరఫరా కేంద్రాలెన్ని..? లాంటి వివరాలను కూడా పోర్టల్‌లో చూసుకునే వెసులుబాటు ఉంటుంది.. 2000 చదరపు అడుగుల్లోపు నిర్మాణాలకు సాధారణ బుకింగ్స్ అమలు చేయనుండగా.. 2000 చదరపు అడుగులు మించితే బల్క్ విధానంలో బుక్ చేసుకునేలా పోర్టల్ రూపకల్పన చేసింది ఏపీ ప్రభుత్వం.. ఏపీ శాండ్‌ పోర్టల్‌ పేరిట ఈ పోర్టల్‌ రూపొందించారు.. ఇక, అధికారులు ఇప్పటికే ఏపీ ఇసుక నిర్వహణ పోర్టల్‌, యాప్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా అన్ని జిల్లాల వివిధ శాఖల ఉద్యోగులందరికీ శిక్షణ ఇచ్చారు. సెప్టెంబరు 11 నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అది ఆలస్యమైంది.