NTV Telugu Site icon

Employees Transfers: బదిలీల నుంచి తప్పించుకోవడానికి ఉద్యోగుల అడ్డదారి..! సర్కార్‌ సీరియస్‌

Ap Govt

Ap Govt

Employees Transfers: ఉద్యోగుల బదిలీలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ఈ మేరకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీయూష్‌కుమార్‌ గత వారం ఉత్తర్వులు జారీ చేశారు. 15 ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలు చేపట్టనున్నారు.. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, సెర్ప్‌, మునిసిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థలు, గ్రామ, వార్డు సచివాలయాలు, సివిల్‌ సప్లయీస్‌, మైనింగ్‌ అండ్‌ జియాలజీ లాంటి అన్ని విభాగాల్లోని ఇంజనీరింగ్‌ ఉద్యోగులు, దేవదాయ, రవాణా, పరిశ్రమలు, విద్యుత్‌శాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, కమర్షియల్‌ ట్యాక్స్‌, ఎక్సైజ్‌ శాఖలు కూడా ఉన్నాయి. అయితే, సాధారణ బదిలీల నుంచి తప్పించుకునేందుకు పక్కదారి పడుతోన్నారు పలువురు ఉద్యోగులు. బదిలీల నుంచి వెసులుబాటు కోసం వివిధ సంఘాల నుంచి ఆఫీస్ బేరర్ల లెటర్లు తీసుకుంటున్నారట పలువురు ఉద్యోగులు. ఆఫీస్ బేరర్లు కాకున్నా కొన్ని ఉద్యోగ సంఘాలు లేఖలు ఇచ్చేస్తోన్నట్టు గుర్తించిన ప్రభుత్వం.. అనర్హులకు లేఖలు.. ఫేక్ ఆఫీస్ బేరర్ల లెటర్లపై సీరియస్‌ అయ్యింది..

Read Also: Vijayawada: బెజవాడలో వైసీపీకి షాక్‌.. టీడీపీ గూటికి కార్పొరేటర్లు..

ఆఫీస్ బేరర్ల లెటర్ల స్క్రూట్నీ కోసం మొత్తంగా ఏడు రకాల డాక్యుమెంట్లు ఇవ్వాలని అసోసియేషన్లకు మెమో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. ఆయా అసోసియేషన్ల బైలాస్, ఓటర్ల లిస్టు, అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ డాక్యుమెంట్లు, సర్వసభ్య సమావేశ తీర్మానాల కాపీలను సమర్పించాలని ప్రభుత్వం సూచించింది.. డాక్యుమెంట్ల ఆధారంగా ఆఫీస్ బేరర్ల లెటర్లను స్క్రూట్నీ చేయనుంది సర్కార్‌.. అయితే, తప్పుడు డాక్యుమెంట్లు ఇచ్చినా.. ఫేక్ లెటర్ల ఇచ్చినా చర్యలు ఉంటాయని అసోసియేషన్లకు ప్రభుత్వం వార్నింగ్‌ ఇచ్చింది.. కాగా, 2024 జులై 31వ తేదీ నాటికి ఒకే స్థానంలో ఐదేళ్లు పూర్తయిన వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది.. ఒకే చోట వివిధ కేడర్లలో ఐదేళ్లు పూర్తిచేసిన వారికి కూడా స్థానచలనం కలిపించనుంది ప్రభుత్వం.. ఒకే స్థానంలో ఐదేళ్లు పనిచేయని వారు కూడా బదిలీలకు అర్హులే.. వారిని పరిపాలనా సౌలభ్యం దృష్టా లేదా వారి అభ్యర్థన మేరకు బదిలీ చేయనున్నారు.. ఎక్సైజ్‌ ఉద్యోగులకు సెప్టెంబర్‌ 5 నుంచి 15వ తేదీ వరకు, మిగిలిన 14 శాఖల్లో పనిచేస్తున్న వారికి ఈ నెల 17వ తేదీ నుంచి 31వ తేదీలోపు బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయం విదితమే.