NTV Telugu Site icon

Minister Satya Kumar Yadav: ప‌నివేళ‌లు పాటించని వైద్య సిబ్బందిపై మంత్రి ఆగ్రహం.. ఇక, ఆటోమేటిక్‌గా షోకాజ్‌ నోటీసులు..!

Satya Kumar Yadav

Satya Kumar Yadav

Minister Satya Kumar Yadav: వైద్య సిబ్బంది ప‌నివేళ‌లు పాటించ‌క‌పోవ‌డంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సత్యకుమార్‌ యాదవ్.. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ వైద్యులు, ఇత‌ర సిబ్బంది నిర్ణీత ప‌నివేళ‌లు పాటించ‌క‌పోవ‌డంపై మండిపడ్డారు.. ఈ విష‌యంపై గురువారం సాయంత్రం మూడు గంట‌ల‌కు పైగా మంత్రిత్వ శాఖ‌లోని ఉన్నతాధికారుల‌తో లోతుగా స‌మీక్షించారు. ప‌నివేళ‌ల ప‌ట్ల నెల‌కొన్న క్రమ‌శిక్షణా రాహిత్యం, దానిని అరిక‌ట్టేందుకు ప్రస్తుతం వివిధ స్థాయిల్లో చేప‌డుతున్న చ‌ర్యలు, ప‌రిస్థితిని మెరుగుప‌ర్చేందుకు మున్ముందు చేప‌ట్టాల్సిన చ‌ర్యల గురించి వివ‌రంగా చ‌ర్చించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి కృష్ణబాబు, వివిధ శాఖాధిప‌తులు స‌మీక్షలో పాల్గొన్నారు. ఎక్కువ మంది క్రమశిక్షణ పాటిస్తున్నా.. కొంత మంది సిబ్బంది ప‌నివేళ‌ల‌ను ఉల్లంఘిస్తుండ‌డంతో ప్రజారోగ్య వ్యవ‌స్థకు చెడ్డ పేరు వ‌స్తోంద‌ని మంత్రి అన్నారు.

Read Also: Isreal- Gaza Conflict: గాజాపై మరోసారి ఇజ్రాయెల్ దాడి.. 27 మంది మృతి

వైద్యులు, ఇత‌ర సిబ్బంది ఆల‌స్యంగా విధుల‌కు రావ‌డం, నిర్ణీత స‌మ‌యానికంటే ముందే నిష్క్రమించ‌డంపై ప్రసార మాధ్యమాల్లో త‌ర‌చుగా వ‌స్తున్న వార్తలు త‌న‌ను ఆవేద‌న‌కు గురిచేస్తున్నాయన్నారు మంత్రి సత్యకుమార్‌.. వివిధ స‌మ‌స్యల‌తో ప్రభుత్వాసుప‌త్రుల‌కు వ‌చ్చే రోగుల‌కు వైద్యులు అందుబాటులో లేక‌పోతే వారెంతో ఇబ్బందుల‌కు గుర‌వుతార‌ని, క‌నుక అంద‌రూ ప‌నివేళ‌ల‌ను పాటించేలా త‌గు చ‌ర్యలు చేపట్టాల‌ని మంత్రి ఆదేశించారు. ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల నుంచి అత్యున్నత ప్రభుత్వ స‌ర్వ జ‌న ఆసుప‌త్రులు వ‌ర‌కు వైద్యులు, స‌హాయ‌క సిబ్బంది హాజ‌రుపై ప‌ర్యవేక్షణ జ‌రుగుతున్న తీరును చ‌ర్చించి ప్రస్తుత వ్యవస్థలో లోపాల్ని గ‌మ‌నించారు. హాజ‌రును దినవారీగా ప‌రిశీలించి నిర్ణీత వేళ‌ల మేర‌కు విధులకు హాజ‌రు కాని సిబ్బందిపై ప‌టిష్టమైన ప‌ర్యవేక్షణ లేక‌పోతే ప్రభుత్వాసుప‌త్రుల‌కు వ‌చ్చే ల‌క్షలాది ప్రజ‌ల‌కు తీవ్ర అన్యాయం చేసిన‌వార‌మ‌వుతామ‌ని మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ ఆందోళ వెలిబుచ్చారు.

Read Also: Triptii Dimri : యానిమల్ రిలీజయ్యాక మూడు రోజులు ఏడ్చా.. భాభీ 2 షాకింగ్ కామెంట్స్

ఇక, క్రమ‌శిక్షణ త‌ప్పితే త‌గు క‌ఠిన చ‌ర్యలు తీసుకోబ‌డ‌తాయ‌న్న ఆలోచ‌న, భ‌యం సిబ్బందిలో లేక‌పోతే ప‌రిస్థితిలో మార్పు రాద‌ని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో హాజ‌రు విష‌యంలో నిత్య ప‌ర్యవేక్షణ చేయ‌డం కోసం ఆ బాధ్యత‌ను మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ మంత్రిత్య శాఖ‌లోని వివిధ శాఖాధిప‌తుల‌కు అప్పగించి, వీలైనంత త్వర‌లో మార్పు తెచ్చేందుకు త‌గు చ‌ర్యల్ని చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఎఫ్ఆర్ఎస్ విధానంలో వైద్య సిబ్బంది త‌మ హాజ‌రును న‌మోదు చేయ‌డానికి రూపొందించ‌బ‌డిన యాప్‌ను మంత్రి నిశితంగా ప‌రిశీలించారు. ఈ యాప్ యొక్క ప్రయోజ‌నాన్ని, దాన్ని ప‌ర్యవేక్షణ కోసం వాడుకుంటున్న తీరుపై మంత్రి ప‌లు ప్రశ్నలు అడిగారు. ఈ యాప్ ద్వారా సెప్టెంబ‌ర్‌ నెల‌లో న‌మోదైన హాజ‌రును మంత్రి ప‌రిశీలించారు. ఉన్నతాధికారుల స్థాయిలో స‌మ‌ర్ధవంత‌మైన ప‌ర్యవేక్షణ‌కు అవ‌స‌ర‌మైన కొన్ని మార్పుల్ని ఆయ‌న సూచించారు. మూడు రోజుల పాటు నిర్ణీత వేళ‌ల మేర‌కు విధులు నిర్వహించ‌క‌పోయినా, అనుమ‌తి లేకుండా గైరు హాజ‌రైనా ఒక రోజు జీతం కోత విధిస్తున్నామ‌ని అధికారులు మంత్రికి వివ‌రించారు. ఈ యాప్‌ను మ‌రింత మెరుగుప‌ర్చి ప‌నివేళ‌ల్ని ఉల్లంఘించే సిబ్బందికి ఆ మేర‌కు స‌మాచారంతో పాటు ఆటోమేటిక్ గా షోకాజ్ జారీ చేసే విధంగా యాప్‌లో మార్పులు చేయాల‌ని ఈ స‌మావేశంలో నిర్ణయించారు..

Show comments