Minister BC Janardhan Reddy: రాష్ట్రంలో రహదారులను సంక్రాంతి 2026 నాటికి గుంతల రహితంగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు & భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులకు స్పష్టమైన డెడ్‌లైన్ విధించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ఉమ్మడి కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల R&B ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు జిల్లాల్లోని రోడ్ల ప్రస్తుత పరిస్థితి, జరుగుతున్న మరమ్మతు పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. 10,880 కి.మీ రహదారులు – జనవరి 10లోపు గుంతల మరమ్మతులు.. మూడు జిల్లాల్లో మొత్తం 10,880 కి.మీ పొడవున ఉన్న R&B రహదారులను పూర్తిగా గుంతల రహితంగా తీర్చిదిద్దాలని మంత్రి ఆదేశించారు.
ఇందులో.. రాష్ట్ర రహదారులు.. 3,312 కి.మీ, జిల్లా ప్రధాన రహదారులు 7,575 కి.మీగా ఉన్నాయి.. ఎక్కడైనా కొత్తగా గుంతలు ఏర్పడితే, వాటి మరమ్మతులను 2026 జనవరి 10 లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇక, కాంట్రాక్టర్ బిల్లులు, చెల్లింపులపై కీలక ఆదేశాలు జారీ చేశారు.. రోడ్ల మరమ్మతు పనులు సమయానికి పూర్తి కావడమే కాకుండా, కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలని మంత్రి సూచించారు. అందులో భాగంగా అన్ని పనుల బిల్లులను జనవరి 2026 లోపు అప్‌లోడ్ చేయాలి.. బిల్లుల తయారీ, అప్‌లోడ్ ప్రక్రియలో కాంట్రాక్టర్లకు పూర్తిగా సహకరించాలి.. సకాలంలో చెల్లింపులు జరిగేలా పర్యవేక్షించాలన్నారు బీసీ జనార్ధన్ రెడ్డి..
అధికారులు ఇప్పటికే మంజూరైన 1,775 కి.మీ రహదారి మరమ్మతు పనులను జూన్ 2026 నాటికి పూర్తి చేస్తామని మంత్రి జనార్ధన్ రెడ్డికి వివరించారు. రోడ్ టెండర్ల కాలపరిమితి ఒక వారం – ప్రతిపాదనకు మౌఖిక ఆమోదం.. రాష్ట్ర హైవేలు, రహదారుల పనులకు సంబంధించిన టెండర్ల కాలపరిమితిని ఒక వారంగా నిర్ణయించాలని ఇంజినీర్-ఇన్-చీఫ్ (R&B) చేసిన ప్రతిపాదనకు మంత్రి మౌఖికంగా ఆమోదం తెలిపారు. జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో PPP మోడల్ పై చర్చ.. కానీ రోడ్లపై ప్రభుత్వం వెనక్కి తగ్గదు.. మెడికల్ కాలేజీల PPP టెండర్లపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో PPP పెట్టుబడులపై చర్చకు దారి తీసినా, రోడ్ల మరమ్మతులు & అభివృద్ధి విషయంలో మాత్రం ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముందుకే వెళ్తుందని మంత్రి స్పష్టం చేశారు. గత ఏడాది సంక్రాంతి నాటి స్పందనను గుర్తు చేసిన మంత్రి.. గత సంక్రాంతి సమయంలో పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన ప్రజలు, స్థానికులు కూడా రహదారుల మెరుగైన పరిస్థితిపై సంతోషం వ్యక్తం చేశారని మంత్రి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల అభివృద్ధిపై ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగిందన్నది వాస్తవమేనని పేర్కొన్నారు.
సంక్రాంతి తర్వాత వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా రోడ్ల నిర్వహణ.. సంక్రాంతి అనంతరం వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రజల సంతృప్తి మరింత పెరిగేలా రోడ్లను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు బీసీ జనార్ధన్ రెడ్డి.. జూన్ 2026లోపు అన్ని అప్‌గ్రేడేషన్ పనులు పూర్తి చేయాలి.. రోడ్ల అభివృద్ధి, అప్‌గ్రేడేషన్, వార్షిక నిర్వహణకు సంబంధించిన మంజూరైన అన్ని పనులను జూన్ 2026 నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పని చేయాలని.. ముఖ్యమంత్రి సూచనల మేరకు రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని, ప్రజలకు మెరుగైన, సురక్షిత రోడ్లను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.