Site icon NTV Telugu

Cyclone Montha: తుఫాన్‌ సహాయక చర్యల్లో పాల్గొనాలి.. ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలకు జనసేన పిలుపు..

Nadendla Manohar

Nadendla Manohar

Cyclone Montha: మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది జనసేన పార్టీ.. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తుఫాన్‌ సహాయక చర్యల్లో జనసేన నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జనసైనికులు, వీర మహిళలు ముందుండాలని మంత్రి మనోహర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ యంత్రాంగానికి పార్టీ శ్రేణులు తగిన విధంగా సహకరించాలి, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ప్రణాళికతో ప్రజలను ఆదుకోవాలని సూచించారు. రైతులకు ప్రభుత్వం భరోసా ఇస్తోందని, వారికి ధైర్యం చెప్పాలన్నారు. ప్రభుత్వ సూచనలు, జాగ్రత్తలు ప్రజల్లోకి చేరేలా చురుకైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ఆదేశాల మేరకు, పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్..

Read Also: The Family Man 3 : ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌ – సీక్రెట్‌ మిషన్‌ మొదలు!

కాగా, మొంథా తుఫాన్‌ కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న క్రమంలో కాకినాడ జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. జిల్లాలోని 12 మండలాలపై ప్రభావం ఉంటుందనీ తెలిసిన క్రమంలో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని సూచించారు పవన్‌ కల్యాణ్‌.. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వారికి అవసరమైన ఆహారం, రక్షిత తాగు నీరు, పాలు, ఔషధాలు సమకూర్చుకోవాలి అన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నందున ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రజలకు తెలియచేయాలని తెలిపారు. తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి, విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉంటుంది.. వాటి పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగుల వివరాలు తెలుసుకొని.. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని దిశానిర్దేశం చేసిన విషయం విదితమే..

మరోవైపు, ‘మొంథా’ తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి తహశీల్దార్ కార్యాలయం మరియు కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్లలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి కందుల దుర్గేష్.. అనంతరం కొవ్వూరు నియోజకవర్గం మద్దూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి సూచనలు అందజేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్..

Exit mobile version