Excise Policy: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కొనుగోలు చేసే వారికి, అలాగే బార్ వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు చేస్తూ, బార్లపై విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై వైన్స్ అయినా.. బార్ అయినా.. ఎక్కడ లిక్కర్ కొనుగోలు చేసినా ఒకే రేటు అమల్లోకి రానుంది. ఈ మేరకు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 2019 నవంబర్ నుంచి అమల్లో ఉన్న ప్రత్యేక అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను తొలగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా బార్ వ్యాపారులకు పెద్ద ఊరట లభించనుంది. ఇప్పటివరకు ఒకే మద్యానికి రిటైల్ షాపుల్లో ఒక ధర, బార్లలో మరో ధర ఉండేది. తాజా మార్పులతో ఇకపై రిటైల్ షాపులు, బార్ల మధ్య ధరల తేడా ఉండదు.
అయితే, లిక్కర్ ధరల్లో సమానత్వం తీసుకురావడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీఎస్‌బీసీఎల్ డిపోల నుంచి బార్లకు సరఫరా చేసే ఐఎంఎఫ్‌ఎల్, ఎఫ్‌ఎల్‌పై ఇకపై అదనపు పన్ను విధించరాదని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే ఎక్సైజ్ చట్టాల ప్రకారం కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని, 2025 బార్ లైసెన్స్ నిబంధనల్లో అవసరమైన సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్పుల అమలుకు డైరెక్టర్ ఆఫ్ ఎక్సైజ్, డిస్టిలరీస్ కమిషనర్, ఏపీఎస్‌బీసీఎల్ అధికారులు బాధ్యత వహించనున్నారు. ఈ ఉత్తర్వులు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. తాజా ఎక్సైజ్ పాలసీ మార్పులు రాష్ట్రంలో మద్యం ధరల వ్యవస్థలో కీలక మలుపుగా మారనున్నాయి.