Cyclone Aquan Alert: అక్వాన్ తుఫాన్‌పై ఏపీ ప్రభుత్వం అలర్ట్.. యాక్షన్ ప్లాన్ రెడీ.. అధికారులకు కీలక ఆదేశాలు

Cyclone Aquan Alert

Cyclone Aquan Alert

Cyclone Aquan Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది.. ఇక, వాయుగుండం కాస్తా అక్వాన్‌ తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండు తుఫాన్లు బీభత్సం సృష్టించగా.. ఇప్పుడు అక్వాన్ తుఫాన్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులు, మత్స్యకారులు ఎలాంటి నష్టం బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాన్‌ ప్రభావంతో పంటలు దెబ్బతినకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రైతుల పంటలు, మత్స్యకారుల ప్రాణాలు, జీవనోపాధిని కాపాడటమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 23.87 లక్షల హెక్టార్ల వ్యవసాయ పంటలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ముఖ్యంగా తీరప్రాంతంలోని 10 జిల్లాల్లో 9.51 లక్షల హెక్టార్ల పంటలను రక్షించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తుఫాన్‌ ప్రభావిత 16 జిల్లాల్లో 2.69 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మత్స్యకారుల భద్రతపై కూడా మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలోని మొత్తం 30,808 మత్స్యకార బోట్లలో ఇప్పటికే 30,635 బోట్లు సురక్షితంగా తీరానికి చేరుకున్నాయని తెలిపారు. మిగిలిన 173 బోట్ల ఆచూకీ, భద్రతపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. ఇప్పటివరకు మత్స్యకారులకు 1,08,250 వాయిస్ హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు. తుఫాన్‌ కారణంగా ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లితే 24 గంటల్లో ప్రాథమిక నివేదికలు సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో రైతుల వారీగా పూర్తి వివరాలను అందించాలని స్పష్టం చేశారు. నష్టాల అంచనాలో ఎలాంటి జాప్యం జరగకూడదన్నారు. విధుల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు మంత్రి అచ్చెన్నాయుడు..