Site icon NTV Telugu

CM Chandrababu: ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు చంద్రబాబు కీలక ఆదేశాలు.. పర్యటించాల్సిందే..!

Cbn

Cbn

CM Chandrababu: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం.. పాలనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయన్న ఆయన.. జిల్లాల్లో ఇంఛార్జ్ మంత్రులు తప్పనిసరిగా పర్యటించాలని స్పష్టం చేశారు.. అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించాలి. జిల్లాలకు వెళ్లే సమయంలో ఆయా జిల్లా కో-ఆర్డినేటర్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మంత్రులు సమాచారం అందించాలి. గ్రూపు రాజకీయాలకు ఎక్కడా తావు ఇవ్వకూడదు. జిల్లా ఇంఛార్జ్ మంత్రులు వారి జిల్లాల్లో ఫోకస్ పెట్టాలి. పర్యటనల సంఖ్య పెరగాలి. కార్యకర్తలు, నాయకులతో మమేకమవ్వడంతోపాటు జిల్లా పార్టీ కార్యాలయానికి తప్పకుండా వెళ్లాలని ఆదేశించారు.

Read Also: Bharat Ane Nenu: మహేష్ బాబు ఫ్యాన్స్‌తోనే కామెడీనా?.. ఫైట్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో!

ఇక, ఏ స్థాయిలో కూడా వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని స్పష్టం చేశారు చంద్రబాబు.. నేను ఈ విషయాన్ని చెప్తే వైసీపీకి ఓటు వేసిన వారికి పథకాలు ఇవ్వొద్దని చెప్పినట్లు ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆయన.. సంక్షేమ కార్యక్రమాల అమల్లో వివక్ష ఉండదు.. పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నాం.. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయ పరమైన సంబంధాలు వేరన్నారు. వైసీపీ వారిని దరిచేరనివ్వొద్దని సూచించారు.. మరోవైపు, నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నాం. పేర్లను సిఫారసు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని.. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారి వివరాలను నామినేటెడ్ పదువుల కోసం అందించాలి. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తాం.. రాష్ట్రం వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు ఛైర్మన్‌లను నియమిస్తాం అన్నారు..

Read Also: Bharat Ane Nenu: మహేష్ బాబు ఫ్యాన్స్‌తోనే కామెడీనా?.. ఫైట్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో!

నామినేటెడ్ పదువుల కోసం 60 వేల దరఖాస్తులు వచ్చాయి.. అన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నాం. పదువులు తీసుకున్నట్లు కాదు… ఎన్నికల్లో ప్రభావం చూపించాలని సూచించారు సీఎం చంద్రబాబు.. మొదటిసారే పదవులు రాలేదని అనుకోవద్దు… రెండేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మిగిలినవారికి అవకాశాలు కల్పిస్తామన్న ఆయన.. ఇప్పటికే పదవులు తీసుకున్న వారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నాం అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నామో ఇప్పుడూ అంతే హుందాగా వ్యవహరించాలి. ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన మనం అందించాలి. సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించడం మన విధానం. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి గ్రామంలో అమలు చేసేందుకు ఎమ్మెల్యేలు, నేతలు చొరవ తీసుకోవాలి. 2 కిలోవాట్‌ల రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రూ.20 వేల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనంగా అందిస్తాం. కేంద్రం ఇచ్చే రాయితీతో కలిపి బీసీలకు రూ.80 వేల మేర రాయితీ వస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఏర్పాటు చేస్తాం. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 10 వేల రూఫ్‌టాప్‌ల ఏర్పాటే లక్ష్యం పెట్టుకోవాలన్నారు.. ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీలో, ఎంపీలు పార్లమెంట్‌లో మీ నియోజకవర్గ సమస్యలను లేవనెత్తి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. మూడు పార్టీల నేతలను, కార్యకర్తలను కలుపుకుని ప్రజాప్రతినిధులు ముందుకెళ్లాలని సూచించారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version