Site icon NTV Telugu

CM Chandrababu: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఘటనలపై సీఎం సీరియస్‌.. కీలక ఆదేశాలు..

Cbn

Cbn

CM Chandrababu: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆడబిడ్డలపై జరిగిన రెండు ఘటలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.. అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగురాళ్లపల్లిలో బాలికపై అత్యాచారం ఘటనపై సీఎం సమీక్షించారు. రెండు ఘటనలపై డీజీపీ సహా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి దర్యాప్తు అంశాలను వివరించారు. అనంతపురం ఘటనలో తన్మయి అనే యువతి తెలిసిన వ్యక్తి చేతిలో హత్యకు గురికాగా.. ఏడుగురాళ్లపల్లిలో బాలికపై కొద్దిమంది చాలా కాలంగా అత్యాచారానికి పాల్పడడం దారుణమని అన్నారు. ఈ రెండు ఘటనలపై సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పూర్వాపరాలు పూర్తిగా తెలుసుకున్న ముఖ్యమంత్రి.. ఈ కేసుల్లో నిందితులకు వెంటనే శిక్షలు పడాలని అన్నారు. వెంటనే విచారణ పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసి ట్రయల్స్ పూర్తయ్యేలా చూడాలన్నారు.

Read Also: Bengaluru stampede case: ఆర్సీబీ తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం.. ప్రభుత్వానికి 9 ప్రశ్నలు..

ఇక, ఈ కేసుల్లో ప్రత్యేక శ్రద్ధతో పక్కాగా ఆధారాలు సేకరించి నిందితులకు అత్యంత కఠిన శిక్షలు పడేలా చూడాలని అన్నారు సీఎం చంద్రబాబు. మహిళలపై నేరాల విషయంలో పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించాలన్నారు. నేరం చేయాలనే ఆలోచన ఉన్నవారు పోలీసులు తీసుకునే చర్యల గురించి భయపడే పరిస్థితి రావాలన్నారు. ఆడబిడ్డలపై క్షణికావేశంలోనో… గంజాయి మత్తులోనో… వ్యవస్థీకృతంగానో నేరాలకు పాల్పడే వారికి శిక్షతప్పదనే అభిప్రాయాన్ని కలిగించాల్సి ఉందని సీఎం అన్నారు. ఈ రెండు ఘటనలే కాకుండా… మహిళలపై అఘాయిత్యాలకు, వారిపై హింసకు, లైంగిక దాడికి ఎవరు పాల్పడినా గట్టి సందేశం ఇచ్చేలా పోలీస్ శాఖ ద్యర్యాప్తు, చర్యలు ఉండాలని సీఎం అన్నారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లు నేరగాళ్లపై నియంత్రణ లేదని, గంజాయి, డ్రగ్స్, చట్టం అంటే భయం లేకపోవడం వల్ల నేరగాళ్లు అదుపులో లేకుండా పోయారని.. దీంతో నేటికీ కొందరు పాత అలవాట్లను మానుకోవడం లేదని అన్నారు. ముఖ్యంగా గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నానని.. 100 శాతం మార్పు కనిపించాలని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version