CM Chandrababu: పెట్టుబడులు మౌళిక సదుపాయాల శాఖ రివ్యూలో అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి కీలక విషయాలు తీసుకొచ్చారు. వివిధ రకాల కార్పొరేషన్లలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని అధికారులు సీఎం చంద్రబాబుకు చెప్పారు. ఫైబర్ నెట్ కనెక్షన్ల వివరాలను సీఎం చంద్రబాబు అడిగితే అవి లేవని అధికారులు చెప్పడంతో.. కనెక్షన్ల సొమ్ములను కూడా దోచుకున్నారా అంటూ ఆశ్చర్యపోయారు. అన్ని రకాల కార్పొరేషన్లలో ఆడిటింగ్ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఫైబర్ నెట్ కార్పొరేషన్‌ను కడప వైసీపీ కార్యకర్తలతో నింపేశారని ప్రభుత్వం గుర్తించింది.
Read Also: Sheikh Hasina: మరికొన్ని రోజులు ఇండియాలోనే షేక్ హసీనా.. ఏర్పాట్లు సిద్ధం..
ఇక, సగం మంది ఉద్యోగులు పనిచేయకుండానే జీతం తీసుకున్నట్లుగా సమీక్షలో తేలింది. ఫైబర్ నెట్ పేరుతో 1500 కోట్ల రూపాయలు రుణం తీసుకొని.. పక్కదారి పట్టించారని చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఫైబర్ నెట్ కనెక్షన్ల నెలవారీ ఛార్జీల డబ్బులను కూడా సొంతానికి వాడేసుకున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీజ్ చేసి ఉన్న ఫైబర్ నెట్ కార్యాలయాన్ని తెరిచి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఫైబర్ నెట్ కనెక్షన్లు కూడా 9 లక్షల నుంచి 5 లక్షలకు తగ్గిపోయాయని అధికారులు వివరించారు. మరోవైపు.. పోర్టుల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం.. రామయాపట్నం పోర్టు కాంట్రాక్టర్ విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కాగా.. కాంట్రాక్టర్ విషయంలో అభ్యంతరాలున్నా.. గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయలేమన్నారు చంద్రబాబు. పోర్టుల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా దృష్టి సారించాలని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు నాయుడు.