CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్‌చాట్‌లో పలు కీలక అంశాలపై మాట్లాడారు. పార్టీ వ్యవస్థ బలోపేతం, పెట్టుబడుల సాధన, రెవెన్యూ సమస్యల పరిష్కారం, సాంకేతిక పురోగతి వంటి అంశాలపై వివరించారు. ఈ నెలాఖరులోగా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ నియామకాలు పూర్తి చేస్తాం.. డిసెంబర్ నుండి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తాం అని పేర్కొన్నారు.. అలాగే, పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ నియామకాలపై కసరత్తు కొనసాగుతున్నదని చెప్పారు చంద్రబాబు..
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
ఇక, క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైంది. ఇక షిప్‌మెంట్ మాత్రమే మిగిలింది. నిర్ణయించిన సమయానికి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు సీఎం చంద్రబాబు.. మరోవైపు, పెట్టుబడుల సాధనలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన నిరంతర కృషి వల్ల రాష్ట్రానికి పాజిటివ్ సిగ్నల్ వస్తోందని ప్రశంసలు కురిపించారు.. అవినీతి నిర్మూలనకు సమగ్ర చర్యలు చేపడుతున్నాం. రెవెన్యూ వ్యవస్థలోని పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రెవెన్యూ అంశాలు సంక్లిష్టమయ్యాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.. 22ఏ నిషేధిత జాబితా భూములపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.
అలాగే, ఎమ్మెల్యేలు ప్రజాదర్బార్‌లు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు సీఎం చంద్రబాబు.. మంత్రి లోకేష్ మార్గదర్శకత్వంలో ఎమ్మెల్యేల్లో కదలిక వచ్చింది. ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారమయ్యే వ్యవస్థ ఏర్పాటే మా లక్ష్యంగా పేర్కొన్నారు.. ఇక, ఈ నెల విశాఖలో పెట్టుబడుల సదస్సు జరుగనుంది. సదస్సు “ప్రజెంటేషన్, ఎగ్జిక్యూషన్, ఎగ్జిబిషన్, ఒప్పందాలు” వంటి రూపాల్లో రెండు రోజులు సాగేలా ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.. ఈ సదస్సు ద్వారా ప్రజల అవసరాలు, అధునాతన సాంకేతిక అంశాలపై అధ్యయనం జరగనుంది అని వెల్లడించారు.. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వీఆర్వోల వరకు బాధ్యతతో పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ విధానం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి అని మీడియా చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
