Site icon NTV Telugu

SLBC Meeting: ఏ ఒక్కరూ ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదు..! సీఎం కీలక ఆదేశాలు

Slbc Meeting

Slbc Meeting

SLBC Meeting: : రాష్ట్రంలో ప్రజలు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి పూర్తిగా తొలగిపోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా ప్రజలు నేరుగా బ్యాంకులను ఆశ్రయించే పరిస్థితి రావాలని, అందుకు బ్యాంకర్లు బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 233, 234వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో వివిధ రంగాలకు బ్యాంకులు ఇస్తున్న రుణాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి బ్యాంకులు మరింత చొరవ చూపాలని సీఎం సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగానికి పెద్దపీట వేస్తున్నాయని, డిస్కంలు కూడా కౌంటర్ గ్యారెంటీ ఇస్తున్నందున బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో వెనకడుగు వేయకూడదని పేర్కొన్నారు.

Read Also: Anil Ravipudi: వరుసగా 9 హిట్లు.. 10వ సినిమాపై అనిల్ రావిపూడి సెన్సేషనల్ అప్‌డేట్!”

అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు పెద్ద ఎత్తున రుణాలు అందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు… అప్పుడే అన్ని వర్గాల బడుగులు ఆర్థికంగా ఎదుగుతారని చెప్పారు. ప్రభుత్వంగా తమ వంతు బాధ్యతలు నిర్వర్తిస్తున్నామని, బ్యాంకుల నుంచి కూడా పూర్తి సహకారం కావాలని సూచించారు. రాజధాని అమరావతిని ఫైనాన్స్ సంస్థలకు కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని సీఎం తెలిపారు. ఇప్పటికే 15 బ్యాంకుల కార్యాలయాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశామని, నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా బ్యాంకులు సహకరించాలని కోరారు.

ఇక, డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసిన విధంగానే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లను (FPOs) కూడా బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. టిడ్కో ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం హామీలు అమలు చేయకపోవడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని, ఆ ఇళ్లకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, బ్యాంకులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. డ్వాక్రా గ్రూపుల బ్యాంక్ ఖాతాలపై విధిస్తున్న 15 రకాల ఛార్జీలను తగ్గించాలని సీఎం సూచించారు. భూ రికార్డుల ప్రక్షాళన పూర్తయ్యిందని, క్యూఆర్ కోడ్‌తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు. ఇదే తరహాలో బ్యాంక్ ఖాతాల కోసం కూడా క్యూఆర్ కోడ్ విధానం అమలు చేసే అంశాన్ని బ్యాంకర్లు ఆలోచించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

Exit mobile version